Monday 27 February 2017

                                                             తమిళనాడు యాత్ర (3)
                         ఇక అక్కడనుండి మధ్యాహ్నానికి తంజావూరు బృహదీశ్వరాలయానికి చేరుకున్నాము.త్రిచి నుండి 52 కి.మీ ఉంది .చోళుల అసమాన శిల్ప కళా నైపుణ్యంతో కట్టిన గుడి.దీనిని Big  temple గా స్థానికంగా పిలుస్తారు.ఆస్ట్రేలియానుండి ఒక బృందం ఒక చోట కూర్చొని విశ్రా0తి తీసుకుంటుంటే సెల్ఫీ తీశాను .వారు చిరునవ్వుతో అంగీకరించారు.వారి సెల్ తో నన్ను ఒక ఫోటో తీయమంటే తీశాను.వారు గైడ్ తో చెప్పించు కుంటున్నారు.ఆధ్యాత్మిక,భక్తి పరంగా తక్కువ ప్రాధాన్య మున్నా ఆ గుడి సౌందర్యాన్ని,విశాల ప్రాంగణాన్ని చూసి త రించాల్సిందే.ఎన్ని సార్లయినా అక్కడకు వెళ్లి చూసి రావచ్చు . గుడికి ఎదురుగా అతి పెద్ద నంది అచ్చెరువు గొలుపుతుంది .
               తరువాత రాజభవనం చూసాము.బ్రిటిష్ వారి కంటే ముందు ఉన్న రాజా సంస్థానం వారి కోట అది . ఆ కాలం నాటి సామాగ్రి తో కూడిన మ్యూజియం,దర్బార్ హాల్ ఆశ్చర్యాన్ని కలిగించాయి . 25 నిముషాల documentory చూపించారు. చాలా అద్భుతం గా తీశారు .ఆ ప్రాంత మంతా చూ సి న భావన కలిగింది.దగ్గరలో రాజులు కట్టించిన రిజర్వాయర్ ఉందని అందులో చూపారు.అక్కడకు వెళ్ళటం కుదర్లేదు ..  
          మరుసటి రోజు కుంభకోణం వెళ్ళాము దానికి temple సిటీ అని పేరు.నిజంగా పదుల కొలది ఆలయాలు  ఉన్నాయి ముఖ్య మైనవి కుంభేశ్వర,సారంగపాణి,చక్రపాణి చూసాము . 12 ఏళ్లకోసారి కుంభమేళా జరిగే కోనేరు చూసాము.ఏ గుడిలో 10 మంది కంటే ఎక్కువ మంది లేరు.అన్నీ ఒక గంటలో పూరి చేసుకున్నాము .కుంభేశ్వర ఆలయం లో ఓ ఏనుగు చిన్నగా నాట్యం చేస్తూ మనమి ఛ్చిన  10 రూపాయలు తీసుకుని మనల్ని ఆశీర్వదించే దృశ్యం చాలా నచ్చింది .వ రి, చెరకు ఆప్రాంతం లో బో ర్ల క్రిందనే ఎక్కువగా పండిస్తున్నారు.  మొదటి పంటకు కావేరి నీరు వచ్చాయేమో !మన లాగా పట్టణాల  ప్రక్కన plots వేసి వదిలేసిన దాఖలాలు లేవు .మన లాగా స్థిరాస్తి రంగ పిచ్చిలేదు .
            ఇక కాఫీ 10 రూపాయలకు చిక్కటి పాలతో మంచి రుచిగా ఇస్తారు. పాలు 10 రూపాయలే  ఒక గ్లాసును కాస్త ఎక్కువగా ఇస్తారు తమిళనాడు వారు కాఫీ ప్రియులు మరియు టిఫిన్స్ కూడా బాగా తింటారు.రాత్రిపూట అందరు టిఫిన్స్ తింటారు.రాత్రి పూట  హోటల్స్ లో  భోజనం దొరకదు .అన్ని టిఫిన్స్ రేట్లు బాగా ఎక్కువ దోశలు 40 రూపాయలు పై నే ఉంటాయి .ఇక అన్నింట్లో సాంబారే ,కానీ సాంబారు బాగుంటాయి. భోజనం  70 రూపాయలు ,పెరుగు extra రేట్, కారం,ఉప్పు కూరల్లో బాగా తక్కువ.  వాళ్ళు సాంబారు  పోసుకొని అందులో కూరలు నంజుకుంటారు . 90 రూపాయలకి



fullmeals  ఎగ్మోర్  ఎదురుగ వసంత భవన్ లో బాగుంది. చెన్నయ్ లో తెలుగు పేపర్లు   దొరుకుతాయి  కానీ తంజావూరు,త్రిచి లో దొరకవు.జామకాయలు లావుగా మంచి రుచిగా ఉన్నాయి .కేజీ 80 అమ్ముతున్నారు .కొంత మంది 60 కి ఇచ్చారు  .
               అన్ని హోటల్స్ లో పళ్లరసాల స్టాల్స్ ఉన్నాయి. త్రిచి ,తంజావూరు రెండు జిల్లా కేంద్రాలు వాటి మధ్య దూరం 50 కిమీ .తమిళనాడు లో 38 జిల్లాలు ఉన్నాయి . త్రిచి కాస్త పెద్దదే,తంజావూరు సాంస్కృతికంగా,చారిత్రకం గా బాగా ప్రసిద్ధి.తమిళులు వాళ్ళ సంస్కృతిని బాగా ఇష్ట పడతారు. చెన్నై ఎగ్మోర్ నుండి త్రిచికి superfast trains  350 కిమీ దూరం  5 1/2 గంటలలో వెడతాయి.మధ్యలో తాంబరం ,విల్లుపురం లాంటి పెద్ద junctions ఉన్నాయి.విల్లుపురం నుండి గంటన్నర ప్రయాణం లో పుదుచ్చేరి ఉందట.ఈ మార్గం లో చెన్నై airport  చాలా గొప్పగా కనిపిస్తుంది.త్రిచి నుండి తంజావూరు వెళ్లే మార్గం లో NIT,SASTRA  universities ఉన్నాయి.త్రిచి లో airport ఉంది .ఇక్కడ బస్సులు , ట్రైన్స్ బాగా ఉన్నాయి .వేగంగా వెడతాయి .బస్సు టికెట్స్ కూడా తక్కువ .వాజపేయి UPA  హయాం లోనే రోడ్లు బాగా వేశారు.కుంభకోణం లో అక్కడక్కడా a/c busstop లు కనబడ్డాయి చిన్న రూమ్ లో 10 కుర్చీలు వేసి ఉంటాయి .తిరుగు ప్రయాణం లో ఓ మ్యూజిక్ టీచర్ చెప్పిన దాని ప్రకారం తమిళనాడు అంతా పిల్లలు సాయంత్రం పూట  సంగీతం, నాట్యం నేర్చుకుంటూ ఉంటారట .శిక్షణ సంస్థలు చాలా ఉంటాయట.
     ఏదిఏమయినా భారత దేశాన్ని పుస్తకాల్లో చదివే కంటే యాత్రల ద్వారా మరింతగా తెలుసుకోవ చ్చని అర్థ మయింది.కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన ఒక కార్యక్రమం ప్రకటించింది .ప్రతి రాష్ట్రం మరో రాష్ట్రాన్ని ఎన్నుకొని సాంస్కృతిక సంబంధాలను, సందర్శించటం ద్వారా అభివృద్ధి చేసుకోవాలట. బ్లాగు మిత్రులారా మీరు చూసిన ప్రాంతాలపై ఇలాగే వ్యాసాలూ రాయండి 

Saturday 18 February 2017

                                                    తమిళనాడు యాత్ర నా అనుభవాలు
                  ముందే ప్రయాణ టికెట్స్ బుక్ చేసుకున్నందున స్థిమితంగా ఉన్నాము. కానీ అక్కడ రాజకీయ పోరాటం మొదల య్యింది .ఎక్కడ గందరగోళం జరుగుతుందోనని ఆందోళన పడ్డా గవర్నర్ నిర్ణయం ఆలస్యం అవటంతో మేము యాత్ర ముగించుకుని రాగలిగాము .
           ఒంగోలులో అర్థ రాత్రి హైదరాబాద్ చెన్నై superfast express లో బయలుదేరాము .చెన్నైకి ఉదయం 6 గంటలకి చేరాలి .కానీ ఊరిబయట ముప్పావుగంట ఆపేసాడు.తరువాత కదిలినా చిన్నగా 7;50 కి చెన్నై సెంట్రల్ చేరుకున్నాము.8;15 కు ఎగ్మోర్ లో గురువాయూర్ express లో త్రిచికి వెళ్ళాలి. ఆటోలో ఎగ్మోర్ చేరుకొని పరుగెత్తి ఎక్కినా 2 నిముషాల కే  కదిలింది.ఈ అసౌకర్యానికి బి.పి పేషంట్స్ అయితే ట్రైన్ మిస్ అయ్యేవాళ్ళు .
            చెన్నై సెంట్రల్ బయట ఆటో లు ఎక్కువ రేట్ అడుగుతారు.కొద్దిగా బయటకు వెళ్లి ఎక్కితే మంచిది. సమయం ఉంటె చక్కగా బస్సులు  ఉన్నాయి .కాస్త అడిగి ఎక్కాలి.బస్సులపై వివరాలు తమిళంలో ఉంటాయి.  బస్సు సంఖ్యల ఆధారం గా ఎక్కాలి.ఇంగ్లీష్ లో పేర్లు ఉంటె బాగుండు .సెంట్రల్ నుండి ఎగ్మోర్ కు  40 రూపాయ లు తీసుకుంటారు.కానీ కొంత మంది rs100 అడుగుతారు.బస్సు కు అయితే కేవలం 4 రూపాయలు మాత్రమే.కొద్దీ దూరం ముందు కెడితే ఓ ఫ్లైఓవర్ వస్తుంది.అక్కడకు బస్ లు వస్తాయి.అక్కడనుండి ఎగ్మోర్కు కేవలం 5 నిముషాల ప్రయాణం .
        త్రిచి (తిరుచిరాపల్లి )లో ఆ రూమ్ తీసుకున్నాము . ASHBAY HOTEL  మన సినిమా లో ఉండే మండువా ఇల్లు లాగా ఉంటుంది .అద్దె  ఇద్దరికి RS 950 ,అదనం గా ఒకరికి 250 ఉంటుంది .1956 నుండి నడుస్తున్నది . చక్కటి ఇంటి వాతావరణం 1. 5 ఎకరా విస్తీర్ణం,మొక్కలు చెట్లు ఉంటాయి.రైల్వే స్టేషన్ కి బస్సు స్టాండ్ కి మధ్య లో ఉంటుంది .టిఫిన్స్ త్రిచి  రైల్వే స్టేషన్లో బాగుంటాయి .కొద్దిగా రేట్ కూడా తక్కువే కాఫీ 10 రూపాయలు .మంచి టేస్ట్ ,మన కంటే పరిమాణం కాస్త ఎక్కువ .దోషాలు పెద్దగా ఉంటాయి .రేటు 40 ఉంటుంది భోజనం దగ్గరలో ఆనంద్ హోటల్ ప్రక్కనే రెస్టారంట్ లో బాగుంటుంది .
     ఇక మరుసటి రోజు ఉదయాన్నే శ్రీరంగం బయలు దేరాము.7 కి మీ ఉంటుంది . rs 6 చార్జి .చాలా గొప్పగా ఉంది ఆలయం.విశాల మైన ప్రాంగణం.చాలా గుళ్ళు ఉన్నాయి.విష్ణువు కొలువై ఉన్నాడు.గర్భగుడిలో శయనించిన విష్ణువును చూడటం మరవొద్దు.ప్రాంగణమంతా తిరగాలంటే ఒక పూట  పడుతుంది.వేయి కాళ్ళ మంటపం,చుట్టూ ప్రాకారాల్లాంటి గోపురాలు,చూడచక్కని శిల్ప సంపద .ఆ కాలపు రాజుల అభిరుచి చెక్కిన స్తంభాలు ,మంటపాలు ఆలయాలు గోపురాల లో  వ్యక్త మవుతుంది (తరువాయి భాగం మరో పోస్ట్ లో )       

Wednesday 15 February 2017

తమిళనాడు యాత్ర

తమిళనాడు యాత్ర :.                                                           రెండు రోజులు శ్రీరంగపట్నం,త్రిచి,తంజావూరు,కుంభకోణం యాత్ర గురించి మీతో పంచుకోవాలని పించింది.తిరుచురాపల్లి నే త్రిచి అంటారు.ఇది జిల్లా కేంద్రం,ఇక్కడ airport కూడా ఉంది.దీనికి దగ్గర లోనే శ్రీరంగపట్నం లో విష్ణువు కొలువై ఉన్నాడు.ఇక్కడి  గుడి చాలా విశాలంగా ఉంటుంది.శిల్పకళ కు అచ్చెరువొందుతాం.తరువాత తంజావూరు బృహదీశ్వరాలయం చూశాము.దీనిని big temple అంటారు.ఇది ఆసియా లోనే ఒక పెద్ద గుడి అంటారు.కుంభకోణం లోని సారంగపాణి,కుంభేశ్వర ఆలయాలు దర్శించాం.

Thursday 2 February 2017

బ్లాగులు :ఒక సమీక్ష
                        మన మది లోని భావాలను స్వేచ్చగా వ్యక్తీరించటానికి బ్లాగులు మంచి సాధనంగా ఉపయోగపడేవి . అప్పుడు ఎంతో మంది మిత్రులు పరిచయ మయ్యారు . ఒకరి పోస్టులు మరొకరు చదువుతూ చాలా ప్రొత్సాహక రమైన మాటలతో వ్యాఖ్యలు వ్రాస్తూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్లాగులు ఉండేవి .తరువాత ఫేస్బుక్ బాగా ప్రాచుర్యం పొందిన తరువాత అందరు దానిలో సభ్యులు కావటం తో అక్కడే ఎక్కువగా గడుపుతూ బ్లాగుల్లో వ్రాయటం తగ్గించారు.నేను కూడా అంతే.దీని తరువాత దీనికంటే ప్రభావం కల్గించింది వాట్సాప్.ఇక జనం అంతా వ్యక్తిగతంగా గ్రూపుల్లో ఒకటే ముచ్చట్లు.దీనితో కొంత ఫేస్బుక్ ప్రభావం తగ్గటం తో గమనించిన ఫేస్బుక్ యాజమాన్యం వాట్సాప్ ను కొనేసింది.
           ఇక వాట్సాప్ లో గ్రూపుల్లో ఎన్నో సమస్యలు అడ్మిన్ ఒక ఉద్దేశ్యం తో గ్రూపు ప్రారంభిస్తే  పోస్టులు ఎవరి ఇష్టం వఛ్చినట్లు వారు వ్రాయటం చాలా గొడవలు జరగటం చాలా గ్రూపులు మూసివేయటం జరిగాయి .ఫొటోస్ ,వీడియో లు విపరీతం గా షేర్ చేసుకోవటం ఎంతో మందికి చికాకు తెప్పిస్తుంది .అడ్మిన్స్ ఎంత మొత్తు కున్నా వినే వారు లేరు అంతా చదువుకున్న వారే,మరి అర్థం చేసుకోరు ఎందుకో. రిలయన్స్ ఫ్రీ డేటా ఉండటం వ లన  ఇన్ని గ్రూపులు ఉన్నాయి గాని రేపు డబ్బులు వసూలు చేస్తే చూడాలి ఎంత మంది వాట్సాప్ లో ఉంటారో!
         బ్లాగు మిత్రులందరికీ మనవి ,అందరు మరల రండి బ్లాగు వేదికగా మన ఆలోచనలు అభిరుచులు కలబోసుకుందాము.      

Sunday 1 January 2017

కాలం(Time)
                     భూమి సూర్యుని చుట్టూ మరో  సారి చుట్టి వచ్చింది.అందుకే మన మంతా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం.కాలాన్ని విభజించుకుని పని చేయటం అలవాటయిపోయింది మరి.కానీ గతం లోని పనులు,భావాలు ,అభిరుచులు, లవాట్లు అభిప్రాయాలు దృక్పధాలు ఇవేమన్నా మారాయా,అలాగే ఉన్నాయా   తరచి చూసు కోవటం లేదెవ్వరు.కాలంతో పాటు ఎన్నో మారుతుంటాయి. ఆ మార్పు మంచి వైపుకైతే ఆహ్వానించవచ్చు.అదే చెడు వైపుకైతే ఆలోచించాల్సిందే .
               కొత్తదనం ప్రతి క్షణానికి సొంతం.దాన్నిమరిచి పోతున్నాం .ప్రతిక్షణం మన మనసు నిత్యనూతనం.ప్రతి క్షణాన్ని ఇలాగే ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది.జీవితం నిత్య నూతన మై పోదూ !మనసును ఎప్పుడూ ఉల్లాసంగా ,ఉత్సాహంగా ఉంచుకుంటూ ఉంటే ఆనందం వెతుక్కుంటూ వస్తుంది .
            గతాన్ని తవ్వుకుంటూ బాధపడే కన్నా వర్తమానంలో ఉంటూ చేసే పనిలో లీనమైతే ఆనందం మన సొంత మవుతుంది.కాలం మనల్ని తనలోకి లాక్కెళుతూ ఉంటుంది.ఆ ప్రవాహంలో కొట్టుకు పోకుండా అనుబంధాలను,స్నేహ సంబంధాలను కాపాడుకుంటూ నిత్య నూతనంగా అందరూ గడపాలని నా కోరిక .     

Saturday 17 September 2016

                                             రూపాయికే ఐ.ఐ.టి శిక్షణ (సూపర్ 30)
       పేదరికంతో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం లో చదివే అవకాశం కోల్పోయిన బీహార్ కు చెందిన ఆనంద్ కుమార్  ప్రతి సంవత్సరం ప్రతిభావంతు లైన నిరుపేద విద్యార్థులకు ఉచిత వసతి భోజనం కల్పించి  ప్రతిష్టాత్మక ఐ.ఐ.టి లలో సీట్లు సాధిస్తూ సూపర్ 30 గా గుర్తింపు పొందారు.మన దేశంలో గణిత బోధన,చదువులు ఐ.ఐ.టి. ల పై ఆసక్తి,తమ శిక్షణ కేంద్రం విజయ సూత్రాలపై ఆయన మాటల్లోనే
1) నాకు లెక్కలంటే ప్రాణం.డబ్బుల్లేక  కేంబ్రిడ్జిలో చేరే అవకాశం కోల్పోయాను.ఆ దిగులుతో నాన్న చనిపోయారు.  అమ్మ అప్పడాలు చేస్తే నేను వాటిని అమ్మే వాణ్ని.Ramaanujam school of mathematics మొదలెట్టి ట్యూషన్స్ చెప్పా .
2) మన దేశంలో చదువును ఉద్యోగం ఉపాధితో ముడిపెడుతున్నారు.10 తరువాత ఐ.ఐ.టి పై విద్యార్థుల్లో ఉన్న ఆసక్తిని గమనించి 30 మంది పేద పిల్లలను ఎంచుకుని  వారిని మా ఇంట్లోనే  ఉంచుకుని  శిక్షణ ఇస్తున్నా .
3) కేవలం IITians ను తయారు చెయ్యడమే నా లక్ష్యం కాదు.సాధ్య మైనంత మందికి చదువు చెప్పించి వారి ద్వారా సమాజానికి తిరిగి లబ్ది చేకూర్చాలన్నదే నా ఆశయం.ఈ దేశం లో డబ్బుల్లేక ఎవరు చదువు ఆపేయకూడదు. అదే నా జీవిత అంతిమ లక్ష్యం.
4)సూపర్ 30 లో మేము మూస పద్ద్దతి లో భోదించం. పిల్లలు బృందంగా చర్చించి ప్రశ్నలు తయారు చేస్తారు.వాటికి సమాధానాలు అన్వేషిస్తారు.ఆలోచించే,ప్రశ్నించే తత్వం ఆధారంగా భోధన జరుగుతుంది.సంస్కారం నేర్పుతాం.  నా శిష్యుల్లో ఎవరూ రూపాయి కట్నం తీసుకోలేదు. 
5)మారుమూల ఉన్నవారు పట్టణాలకు వఛ్చి శిక్షణ తీసుకోలేరు.అటువంటి వారి కోసం అంతర్జాలం CELLPHONES ను  ఉపయోగించుకుని ఏడాది లోపే ఆన్లైన్ ద్వారా ఐ.ఐ.టి శిక్షణ ఇవ్వబోతున్నాము. ఒక్క రూపాయి మాత్రమే చెల్లించి నా తరగతులను ఆన్లైన్లో వినవచ్చుఁ. 1 నుండి 12 తరగతి దాకా అన్ని పాఠాలు online లో ఉంచుతా .
6) రామానుజం ఓ విలక్షణ శాస్త్రవేత్త్త. ప్రపంచంలో గణితంలో ఇచ్ఛే అత్యున్నత పురస్కారం పొందిన వాడు మన మంజుల భార్గవ్.కానీ ఇలాంటి వారు మన దేశం లో తయారు కావటం లేదు.మన గణిత బోధనా పద్ధతులు బాగా లేవు. లెక్కల్ని బట్టీ పట్టిస్తున్నాము.ఎలా ఎందుకు అని ప్రశ్నించి,విశ్లేషించే అవకాశం లేకుండా చేస్తున్నాము.
6) మంచి చదువులు మంచి ఉపాధ్యాయులు న్న చోట వస్తాయి.గణిత ఒలింపియాడ్స్ లో  చైనా గత 20 ఇండ్లలో 13 సార్లు ప్రపంచ నెంబర్ 1 గా నిలిచింది.
7) పిల్లల్ని ఆలోచించ నీయకుండా అంతా వారి మెదళ్లలో కుక్కుతుండడంతో వారి ఊహా శక్తి చఛ్చి పోతుంది.
8) ప్రతిభావంతులంతా ఐ.ఐ.టి వైపు పరుగులు తీ స్తుండడంతో  ఉపాధ్యాయ  విద్య వైపు మంచి వారు రావటం లేదు పిల్లల పై చిన్నప్పటి నుండి ఐ.ఐ,.టి  అంటూ ఒత్తిడి తే కండి .వారికి పజిల్స్ ఇస్తూ ఆలోచించే తత్వాన్ని నేర్పండి
9)గణితం లో ఆసక్తికర సమస్యల్ని ఇఛ్చి పరిష్కరించ మనండి.వారి మనసులు  సహజం గా వికసించ నీయండి .
10) వారికి వయసుకు మించిన చదువులు చెబితే పిల్లలు యాంత్రికంగా తయారవుతారు.ఆత్మీయతలు మరిచి పోతారు.  

Friday 1 January 2016

కాల ప్రవాహం@2016

                       కాలం మన జీవితంలోకి ఎప్పుడు ప్రవేశించింది.ఏమిటి ఈ ప్రశ్న అని ఆశ్చర్య పోతున్నారా ?బడికి పోనంతవరకు ఎంత స్వేచ్చని అనుభవించాము.మన కిష్ట మైన పనులు,మనకిష్ట మైన సమయంలో చేస్తూ అమ్మా నాన్నల బంధువుల ప్రేమను పొందుతూ గడిపాము కదా !స్కూల్ లో చేరాము !
          అప్పుడు ప్రవేశించింది కాలం మన జీవితంలోకి !అయినా మనం స్వేచ్చను కోల్పోలేదు.ఉదయం సాయంత్రం తనివి తీరా ఆటలు,బడిలో చదువు అక్కడ కూడా ఆటలు,స్నేహితుల సరదాలు,ఆదివారాలు, సెలవు రోజుల్లో మరింత ఎక్కువగా ఆటలు అలా 9 వ తరగతి వరకు జరిగింది నా విషయం లో,మీరంతా అలానే అనుకుంటాను.10 వ తరగతిలో ఇంటి దగ్గర ఆటలన్నీ బంద్. స్కూల్ లో o.k ఉదయం,సాయంత్రం tutions అలా కాలం తనలోకి తీసుకోవటం మొదలెట్టింది.ఇక ఇంటర్ ,డిగ్రీ ,చదువులు,ఉద్యోగాన్వేషణ వరకు కొంత వరకు అభిరుచులకు సమయం కేటాయిస్తూ కాలాన్ని గురించి జీవన్మరణ సమస్యగా తీసుకోక పోయినా కాలం ఆధీనంలోకి వెడుతున్నట్లనిపించింది.ఉద్యోగము తేలిగ్గానే సాధించటం,వివాహ జీవితం లోకి ప్రవేశించటం,పిల్లలు ,సంపాదన,పిల్లల చదువులు అలా.... .. ,వాళ్ళ చదువులకు కీలక నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది .
              ఎక్కడనుండి ఎక్కడకు వచ్చామా !అని ఆలోచిస్తే కాల ప్రవాహం యొక్క మధ్యలో ఉన్నామని అర్థమయింది .బాల్యంలోని కాలం తెలియని తనంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాము.ఈ ప్రవాహం లో ఎక్కడ తేలుతామో ఆ కాలమే నిర్ణయిస్తుంది .
     అన్నట్టు ఈ కాల ప్రవాహం లోకి మరో సంవత్సరం వచ్చి చేరింది. అందరికి నూతన (2016) సంవత్సర శుభాకాంక్షలు .  

Monday 11 May 2015

మనలో సమూలమైన మార్పును తీసుకురాగలమా!(నేడు జిడ్డు కృష్ణ మూర్తి జయంతి )



              "మన జీవితాలలో దౌర్జన్యం నిండి ఉన్నది .కనుక ఈ ప్రపంచం లో జరుగుతూ ఉన్న ప్రతి యుద్దానికి మనదే బాధ్యత. మన జాతీయ భావాలు,స్వార్థ పరత,దేవుళ్ళు ,అసూయలు,ఆదర్శాలు ఇవన్నీ మనను విడదీస్తున్నాయి ఇందులోని యధార్తను మన ఆకలినో బాధనో గమనించేంతటి స్పష్టంగా సూటిగా ప్రపంచంలోని గందరగోళం అంతటికీ మీరు నేను బాధ్యులుం .దుఖాని కంతటికీ మనదే బాద్యత.విభిన్న మైన సంఘాన్ని తయారు చేయటానికి జ్ఞానులు ఏవేవో చెప్పారు.అన్ని మా ర్గాలు సత్యం వంకే నడుస్తాయని చెప్పారు.పరిశీలిస్తే ఇది అసంబద్దం అని తేలిపోతుంది.  సత్యానికి మార్గం,పథం అంటూ ఏమీ లేదు.సత్యానికి సంబంధించిన సుందరత అదే. అది సజీవ మైనది.దానికి విశ్రాంత మందిర మేమీ ఉండదు.ఎవరు మిమ్మల్ని అక్కడికి తీసుకు పోలేరు.ఈ సజీవ వస్తువే మీ స్వస్వరూపం అన్న సంగతి మీరు గమనిస్తారు మీ కోపము మీ దౌర్జన్యము,మీ నిరాశ,మీ బాధలు ఇదంతా అర్థం చేసుకోవడం లోనే సత్యం ఉన్నది. 
            మీరు ఎవరిపైనా ఆధార పడి మనగలగడం అసాధ్యమని తేలి  పోయింది.ఎవరు మార్గ దర్శకులు లేరు ,గురువులు లేరు ఆధిపత్యం లేదు,ఉన్నదంతా మీరే ఇతరులతో మీ సంబంధ బాందవ్యాలు.మీరు నేను మరే బాహ్య సంపర్కము ప్రభావము లేకుండా ఎవరి ప్రోద్భలము,జులుము,శిక్ష పడుతుందేమో అన్న భయం లేకుండా మనలో సమూల మైన మార్పును తీసుకు రాగలమా ?మానసికంగా ఆకస్మిక పరిణామం తీసుకు రాగలమా మనం అప్పుడు క్రూరులం  కాకుండా పై పోటీ మనో భావం లేకుండా ఆదుర్దాలు, భయాలు,అసూయలు,దురాశలు లేకుండా ఇప్పుడు మన జీవితాలలో నిండిపోయిన కుళ్ళు కల్మషము ఏమాత్రము లేకుండా ఉండగలుగుతాము." JK 
(ఈ వ్యాసం జిడ్డు కృష్ణమూ ర్తి బోధనలతో కూర్చిన ప్రచురణ అయిన అంతరంగ యాత్ర నుండి సేకరించినది .వారికి ధన్యవాదాలు )  
మరిన్ని వివరాలకు http://www.jkrishnamurti.org/index.php  వెబ్సైటు ను సందర్శించండి .

Saturday 18 April 2015

సంభాషణలు చర్చలు ఇలావుంటే ఎలావుంటుంది ?

                         మనందరికీ రాజకీయాలు,సినిమాలు,క్రికెట్ ,కులం,మతం ,వ్యక్తీ ,ప్రాంతం,వర్గం,దేశం,తత్వం లాంటి విషయాల పై కొన్ని నిశ్చితాభి ప్రాయాలు ఉంటాయి.సంభాషణల్లోఎదుటి వారి ముందు అవి వ్యక్త పరుస్తుంటాము. అవతలి వారు కూడా తమ అభిప్రాయాలు చెబుతారు.ఇరువైపులా ఒకే రక మైన అభిప్రాయాలు ఉంటె ఓకే.పరస్పరం వ్యతిరేకమయితే ఇక ఘర్షణ మొదలవుతుంది.ఇలా మనసులో ఒక స్థిర అభిప్రాయం లేకుండా ఏ ప్రభావానికి గురి కాకుండా ఒక సమస్యకు కొత్త కోణంలో సత్యం,వాస్తవం ప్రాతిపదికన చర్చించుకునే openmindset  ఏర్పరచుకోవటం ఎంతో అవసరం.అప్పుడే అందులోనుండి మనమేదయినా కొత్త అంశాన్ని అంటే సత్యాన్ని కనుగొనగలం.అప్పుడు అందరం ఆ అభిప్రాయం తో ఏకీభవించ వచ్చు.సమాజంలో అంత తీరిక,ఓపిక,సహనం ఎవరికీ ఉండటం లేదు.మన మధ్య జరిగే విధంగానే T.V  చర్చల్లో,అసెంబ్లీ,పార్లమెంటుల్లో ప్రతిఫలిస్తుంది.కాబట్టి ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా పోతున్నాయి.
           ఈ openmindset ను పెంపొందించుకునే విధంగా విద్యార్థులను చిన్నప్పటినుండితీర్చిదిద్దాలి ఉపాధ్యాయు
లు ముందుగా ఈ ధోరణిని కలిగి ఉంటే విద్యార్థులకు నేర్పగలరు.అలాగే media కూడా ఈ ధోరణిని ప్రోత్సాహిస్తూ చర్చలు చేపడితే చాలా బాగుంటుంది.ప్రతి సంభాషణ నుండి,చర్చలనుండి ఒక కొత్త అంశం నేర్చుకోవటం,ఓ కొత్త సత్యం ఆవిష్కృతం కావటం,ఒక సమస్యకు పరిష్కారం లభించటం,ఓ వాస్తవిక దృక్పథం ఏర్పడటం,ఇవన్నీ వ్యక్తీ ,సమాజం అభివృద్ది చెందటానికి దోహదం చేస్తాయి

Saturday 11 April 2015

మన సంభాషణల్లో జరిగేది ఏమిటి?

         నిత్య జీవితంలో మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉంటాము.వాటి వలన మన మనసులో ఎన్నో అభిప్రాయాలు ఏర్పడి ఉంటాయి.ఇక మన మిత్రుల దగ్గర,బంధువుల దగ్గర ప్రయాణాల్లో మన వైన అభిప్రాయాలు చెబుతూ వెళతాము.అవతలి వారికి అవి నచ్చితే సరి,నచ్చక పోతే వాతావరణం వేడెక్కుతుంది.సంభాషణలో ఎవరి అభిప్రాయాలు వారివి.కాని వాస్తవం లో ఏమి జరుగుతుంది అంటే మన మనసు మనకు నచ్చిన అంశాలనే ఇష్ట పడుతుంది నచ్చని వాటిపట్ల వ్యతిరేకతను ఏర్పరుచుకుంటుంది.అది క్రమంగా ఆ వ్యక్తుల పట్ల వ్యతిరేకంగా మారు తుంది .విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవటం వలన ఈ సమస్య ఏర్పడుతుంది. క్రమంగా నచ్చే మాటలు మాటలు మాట్లాడే వ్యక్తులతో మాత్రమే మనం ఒక సమూహం లో ఏర్పడి ఒకరికి ఇంకొకరు నచ్చేలా మాట్లాడు కుంటూ కాల క్షేపం చేస్తుంటాము.విషయాలు తెలుసుకోవాలనే తపన తగ్గి పోయి మనం అనుకున్నదే సరిఅయినది అనే మిత్ర బృందంతో మాత్రమే జీవితం  గడుపుతూ ఉంటాము .దీనితో జీవితం లో సత్యాలు తెలుసుకునే మార్గాలు మూసు కుంటాము.ఏ విషయంలో నైనా వాస్తవాలు ఏమిటి,సత్యం ఏమిటి అని తరచి చూసుకోగలిగితే సరిపోతుంది.మనం నమ్మినవి మాత్రమే సత్యాలు అనుకుంటే ఎన్నో విషయాలు తెలుసు కాకుండానే ఈ జీవితం ముగిసి పోతుంది. విభిన్న అభిప్రాయాలను గౌరవిద్దాము,అందులో సత్య మెంతో తరచి చూద్దాము.   

Monday 6 April 2015

అబ్దుల్ కలాం ద్వారా శంఖు స్థాపన చేయబడ్డ అనాధల స్కూల్

             పై విషయం పేపర్ లో చూసిన తరువాత అదీ maartur లో అని తెలిసిన తరువాత వెళదామనిపించింది.కానీ ఒక్కడినే ఎలా అనుకున్నాను.సరే ఎప్పుడో ఒక సారి ఆ స్కూల్ ను చూడాలనుకున్నాను.ఆనంద్ ఫోన్ చేసి కార్లో వెడదామా అనటంతో O.K చెప్పేశాను.నేను,ఆనంద్,రంగయ్య ,DVN ప్రసాద్,T.V. శ్రీనివాస్ తో కలిసి బయలుదేరా ను.మేముండే మార్కాపురం నుండి ఒంగోలు మీదుగా నేషనల్ హైవే పై మార్టుర్ దాటిన తరువాత 2 KM లకు శారదా విద్యా నికేతన్ కనిపించింది. అదే అబ్దుల్ కలాం ఆవిష్కరించ బోయే అనాధల school.
             6 గంటల కల్లా అక్కడికి వెళ్ళాము.60 ఎకరాల్లో ఓ 10 ఎకరాల్లో స్కూల్ ఉంది.అక్కడ మాచెర్ల,వినుకొండ లలో పనిచేసే MARG  స్వచ్చంద నిర్వాహకులు పరిచయమయ్యారు.ఈ స్కూల్ కు వారు 60 మంది పిల్లలను పంపారట.కరీముల్లాఖాన్ అనే ఉపాధ్యాయుడి ద్వారా స్థా పించబడి 2000 మంది వివిధ వృత్తులలో పనిచేసే వారు సభ్యులుగా పనిచేస్తున్నదీ సంస్థ.ఆ సంస్థ లోని  M. పాపిరెడ్డి ,B.నాగరాజు పరిచయమయ్యారు వేదికపై శివారెడ్డి (నటుడు) కొద్దిసేపు మిమిక్రీ చేసారు .
             6:15 కల్లా కలాం గారు వేదిక పైకి వచ్చారు.ఈ స్కూల్ ను స్థాపించిన NRI డాక్టర్ పోలినేని సుబ్బారావు తన తల్లి పేరుతో ఫౌండేషన్ స్థాపించి తన 60 ఎకరాలను(60 కోట్లు విలువ చేసే ) ఈ ఫౌండేషన్ కు దానం చేసాడు. ఆయనకు చిన్నతనంలోనే అమ్మా నాన్న చనిపోవటం తో ఆ లోటు తెలుసుకనుక ఈ స్కూల్ ఏర్పాటు చేసారు.తను ఎలా చదువుకుంది,కాలేయ cancer కు  గురయి బయట పడటం గురించి వివరిస్తుంటే కళ్ళు చెమర్చాయి .cbse syllabus తో 12 వ తరగతి వరకు అన్నిసౌకర్యాలతో (AC HOSTEL,LABS) ఏర్పాటు చేసారు.HIV సోకిన పిల్లలు ,అనాధలు ,తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి ఇందులో ప్రవేశం.ప్రస్తుతం 250మంది ఉన్నారు.పిల్లల బాల్యాన్ని కాపాడాలని,Quality విద్య నందించాలని తన లక్ష్యాన్ని వివరిస్తుంటే కలాం తో సహా అందరూ స్పందించారు. తరువాత కలాం గారు గంట సేపు పిల్లలతో Interactive mode లో సంభాషించారు.పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు . కలాం గారు ఇచ్చిన స్పూర్తితో ,సుబ్బారావు గారి సేవను స్మరించుకుంటూ తిరుగు పయన మయ్యాము


Sunday 5 April 2015

kasturibaschool లో 10వ తరగతి అమ్మాయిలకు careerguidence

                         ప్రతి మండలం లో కస్తూరిబా విద్యాలయాల్లో గ్రామీణ ప్రాంత పేద అమ్మాయిలు విద్యనభ్యసి స్తున్నారు.వారిలో చాలా మందికి ఇంటిదగ్గర  ఆర్ధిక పరిస్థితి సరిగాలేక బడిమానేసిన వారినందరిని ఇక్కడచేర్చుకుని శిక్షణ ఇస్తుంటారు.వారికి careergudence&personalitydevelopment లో శిక్షణ నిమ్మని ఉపాధ్యాయ మిత్రుడు సజీవరావు కోరటం తో ఒక ఆదివారం దోర్నాల (దిగువ srisailam) కస్తురిబా స్కూల్ కి వెళ్లాను.నాతోపాటు దోర్నాల మండల పరిషత్ ప్రెసిడెంట్ వేదాంతం ప్రభాకర్ గారు  (ఈయన సజీవరావు అన్న),కరీం (హిందీ లెక్చరర్ ) వచ్చారు.అక్కడ ప్రిన్సిపాల్ అనూష గారు మమ్ము ఆహ్వానించారు.
                       అమ్మాయిలూ చాలా ఉత్సాహంగా ఉన్నారు.ముందు ప్రభాకర్ గారు వారికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు.రాజకీయనాయకుడు అయినా విద్యార్థుల పట్ల ఎంతో ఆపేక్ష ,చదువు పట్ల ఎంతో ఇష్టం కలిగిన వ్యక్తి .తరువాత నేను ఒక గంట పాటు చదువు యొక్క విలువ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్న అవకాశాలు వివరిస్తూ అద్బుత విజయాలు సాధించిన ఇద్దరు మహిళల గురించి వివరించాను.అందులో ఒకరు ఆకురాతి పల్లవి తెలుగు మీడియంలో డిగ్రీ చదివి ,తెలుగు మీడియం లోనే ఐఏఎస్ వ్రాసి 4 వ ప్రయత్నం లో ఎంపికయిన వారు.వారి గురించి "తెలుగు వెలుగు " పత్రిక లో వస్తే ఆ విషయం వివ రించాను. ఇద్దరు అమ్మాయిలూ మేము ఎన్ని కష్టాలు ఎదురయినా ఆమె లాగా ఐఏఎస్ సాధిస్తామని లక్ష్యం పెట్టుకున్నారు.
                      రెండవ మహిళ జ్యోతిరెడ్డి .ఈమె అత్యంత దయనీయ పరిస్థితుల్లో తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకోబోయి విరమించుకుని పట్టుదలతో అమెరికా వెళ్లి అక్కడ కంపెనీ పెట్టి ప్రస్తుతం తన లాంటి ఎందఱో పేదవారికి సాయం చేస్తున్నారు.ఈ రెండు ఉదాహరణలతో వారిలో ఎంతో పట్టుదల కలిగి వారి వారి లక్ష్యాలను వివరించారు.ఇలా ఆరోజు వారికి చెప్పిన విషయాలతో వారిజీవితం లో కొద్ది మార్పు వచ్చినా చాలు.
             అదేరోజు త్రిపురాంతకం లో సజీవరావు,కరీంముల్లా (PSTeacher ),కరీం గారి ఆధ్వర్యంలో 40 మంది S.C మరియు ,ST పిల్లలకు కూడా ఇదేవిధమైన class నిర్వహించాము. ఆ పిల్లలు కూడా చాలా బాగా విన్నారు .అక్కడ కూడా ఒక విద్యార్థి ఐఏఎస్ లక్ష్యం పెట్టుకోగా మిగిలిన వారందరూ విభిన్న వృత్తులను ఎన్నుకున్నారు . ఈ రెండు కార్యక్రమాలను SAPS అనే స్వచ్చంద సంస్థ నిర్వహించింది .దీనిని వేదాంతం ప్రభాకర్ గారు,సజీవరావు ,కరీం కరీముల్లా నిర్వహిస్తున్నారు . వారిని ప్రత్యేకంగా అభినందించాను .మొదటి ఫోటోలో మాట్లాడుతున్నది వేదాంతం ప్రభాకర్ గారు,కూర్చున్న వారిలో మొదట నేను ,సజీవరాజు ,కరీం,అనూష Principal   (వరుసగా).
      

  రెండవ ఫోటోలో శిక్షణ నిస్తున్న నేను (ఒద్దుల రవిశేఖర్)   

Sunday 8 March 2015

RMSA లో DRP గా 5 రోజుల శిక్షణ

      RMSA లో  DRP(District resource person) గ  నేను,నాగమూర్తి,సజీవరావు,రఘురాం ఎన్నిక  కావటం తో  28/1/15 night hyderabad బయలుదేరాము.బస్సులో కిటికీ సరిగా మూసుకోక పోవటంతో బాగా అసౌకర్యానికి గురయ్యాము. ఇంకొక విషయం ఏంటంటే 11 గంటలకు బస్సు బయలు దేరింది. సినిమా పెట్టారు నేను నిద్ర పోవాలి ఆపమన్నాను.ఇంకొకరు పెట్టమన్నారు. రోజు T.V  లో 10 సినిమాలు వస్తుంటాయి .అయినా రాత్రి ప్రయాణం లో సినిమా కావా లంటారు .ఇదొక ప్రొబ్లెమ్.చివరకు డ్రైవర్ సినిమా తీసేసాడు .
         ఉదయం హైదరాబాద్ లో దిగేసరికి విపరీతమైన చలి. గచ్చిబౌలి లోని టెలికాం సెంటర్ కు చేరుకొని రిఫ్రెష్ అయ్ ఉదయం తరగతులకి  హాజరయ్యాము.మారిన 9,10 తరగతుల physical science textbooks పై  training మొదలయ్యింది.ఆనంద్ (text book writer,SRP)విద్యుత్ ,కాంతి పై చక్కటి అవగాహన కలిగించారు. ఆయనకు   ఫిజిక్స్ పై ఎంత ఇష్టం, పట్టు ఉందొ ఆ చెప్పే  విధానం బట్టి అర్థమవుతుంది.1200 పుస్తకాలతో కూడిన ఫిజిక్స్ లైబ్రరీ ఆయన ఇంట్లో ఉందిట.టీచర్స్ చాలా ప్రేరణ పొందారు .
         నెల్లూరు నుండి ఎ.వి  సుధాకర్  organic chemistry గురించి చెప్పారు. ఈయన scert  తరపున ల్యాబ్ బుక్స్ , సాక్షి భవితలో 10 వ తరగతి physicalscience పై వ్రాస్తున్నారు.నేను సుధాకర్ కలిసి మైసూరు లో జరిగిన కంప్యూటర్ ఎడ్యుకేషన్ శిక్షణకు(NCERT ) వెళ్లి వచ్చాము. ఇంకా కెమిస్ట్రీ  లో ఏకాంబరం,సుబ్రహ్మణ్యం,గురుప్రసాద్ మిగతా తరగతులు  తీసుకున్నారు.చివర్లొ  విద్య,సైన్స్ వెనుక ఉన్న ఫిలాసఫీ ని రమేష్(academic incharge,scert) అద్భుతంగా  వివరించారు.మిత్రు లంతా   smartphones తో  record చేసుకున్నారు. తరువాత A.P STATE  physicalscience teachers forum  ఏర్పడింది .
.    

Saturday 22 November 2014

నా ముంబై యాత్ర(My Mumbai Tour)


                 హోమిబాబా సైన్స్ సెంటర్ వారి ఆహ్వానం మేరకు ముంబై లో 4 రోజుల సెమినార్ కు (10/11/14 నుండి 13/11/14) వెళ్లాను.విజయవాడ నుండి 22 గంటల ప్రయాణం.నేనుముంబై లో  ఆదివారం దిగాను.kadapa నుండి మిత్రుడు hussainkhan అక్కడ వాళ్ళ బావమరిదితో కలిసి నన్ను కలిసాడు.clockroom లో బ్యాగ్ ఉంచి localtrain లో కుర్లా నుండి CST కి  వెళ్ళాము. అక్కడికి  దగ్గరలో Gateway of India,Taj hotel ఉన్నాయి. అక్కడ ఫొటోస్ దిగాము .సముద్రము లోనికి షిప్ లో వెల్లాము. ఇక తిరిగివస్తు మ్యూజియమ్ చూసాము. అక్కడ ముంబై గురించి 20 నిముషాల shortfilm చూపించారు.చాలా బాగుంది beautiful bay నుండి ఆ పేరు వచ్చింది .ఇక మళ్ళీ లోకల్ ట్రైన్ లో ట్రైనింగ్ క్యాంపు కు వెల్లాము.
              4 రోజులు అంతరిక్షం,నక్షత్రాలు గ్రహాల గురించి  చాలా లోతయిన అవగాహన కలిగించారు .ఒక రోజు nightskyobservatin కోసం ముంబైకి 100 కిమీ దూరం  తీసుకెళ్ళి  టెలీస్కోప్ ల సహాయంతో  నక్షత్రాలను చూపించారు.చాలా మంచి అనుభవం అన్ని  రాష్ట్రా లనుండి  60 మంది వచ్చారు . Nepal   నుండి 4 గురు,బంగ్లాదేశ్ నుండి ఒకరు వచ్చారు .Nepal వారికి మహేష్ బాబు ,పవన్ కళ్యాన్ సినిమాలు బాగా నచ్చుతాయని చెప్పారు. బ్రహ్మ నందం కా మెడి చాలా ఇష్టమట.ఒక రోజు రాత్రి interstellar అనే  scintific మూవీకి వెళ్ళాము.చాలా బాగుంది .olympiyad exams గురించి  వివరించారు.  మంచి  అనుభూతితో తో  తిరుగు  ప్రయానమయ్యాము. 

Sunday 12 October 2014

బాలల హక్కుల యోధుడు కైలాష్ సత్యార్థి,మలాలా యూసఫజాయ్ లకు నోబెల్ శాంతి బహుమతి

                బాలల హక్కుల కోసం,వెట్టి చాకిరి నిర్మూలన కోసం,పిల్లల చదువుల కోసం కైలాష్ 3 దశాబ్దాల కృషికి ఈ నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.ఇప్పటికి 80,000 మంది పిల్లలను బాలకా ర్మికత్వం నుంచి విముక్తి చెందించి వారికి అందమైన భవిష్యత్తును కల్పించారు.child labour act,విద్యాహక్కు రూపకల్పనలో పాలు పంచుకున్నారు. భారత దేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్త బాల కార్మికుల కోసం ఈయన కృషిని గుర్తించారు. "నేను చనిపోయే లోపు బాల కార్మిక వ్యవస్థ అంతాన్ని చూస్తాను అని ఆత్మ విశ్వాసం తో చెబుతారు .
             బాలల పథకాలను వారి మీద జాలితో కాకుండా అవి వారి హక్కుగా చూడాలంటారు.పేదరికం,నిరక్షరాస్యత బా ల కార్మికవ్యవస్థ ఈ మూడింటి మధ్య అవినాభావ సంబంధం ఉందని వీటిని ఉమ్మడిగా తుద ముట్టించా లంటారు పిల్లల పట్ల ఆయన భావాలు ఆయన మాటల్లోనే
    "నేను చిన్న పిల్లల చెలికాడిని మనం వారిపట్ల చూపాల్సింది జాలి దయ కాదు మనకు స్వచ్చత పార దర్శకత నేర్పేందుకు పిల్లలను మించిన వారు ఎవరుంటారు .వారు పక్షపాతం లేకుండా ముక్కుసూటిగా ఆలోచించే మాయా మర్మం తెలియని వాళ్ళు "
        ఇంత ప్రేమ వారిపట్ల ఉండబట్టే నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
  ఇక మలాలా చావు బతుకుల మధ్య పోరాడి గెలిచి న  ధీరబాలిక .విద్య నేర్చుకోవటం  పట్ల ఆమె దృఢ చిత్తం ,ప్రాణాలను లెక్క చేయని సాహసం ఆమెకు ఈ అవార్డ్ తెచ్చి పెట్టాయి .ప్రపంచమ్ లోని బాలికలంతా ఆమె స్పూర్తిని అందిపుచ్చుకోవాలి.ఒక విద్యార్థి,ఒక ఉపాధ్యాయుడు ఒక కలం,ఒక పుస్తకం ఈ ప్రపంచాన్ని మారుస్తాయి అని ప్రకటించిన ఆశావాది .
           బాలలందరి తరపున వీరిద్దరిని హృదయపూర్వకంగా అభినందిద్దాము .
కైలాష్ విద్యార్థి గురించి మరింత సమాచారం ఈ క్రింది వెబ్సైటు లో గమనించగలరు . 
http://www.kailashsatyarthi.net/contact/submit.php 

Wednesday 25 June 2014

జీవితంలో కుతూహలం ముఖ్యం ---రాకేశ్ రెడ్డి 2013 CIVILS విజేత

                    దేశంలో అత్యున్నత సర్వీస్ అయిన సివిల్స్ లో 219 రాంక్ సాధించారు మార్కాపురానికి చెందిన రాకేశ్ రెడ్డి .IPS వస్తుందని ఆశిస్తున్నారు . అలాగే  మార్కాపురానికి చెందిన   సాయి శ్రీనివాస్ ఎంసెట్ లో medicine లో state  first సాధించారు. వీరిద్దరికీ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు పాటశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.ఇందులో రాకేశ్ రెడ్డి ఇచ్చిన సందేశం  ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే  ఉద్దేశంతో ఇక్కడ వ్రాస్తు న్నాను.ఆయన మాటల్లోనే


విద్యార్థులంతా కుతూహలాన్ని  కలిగి ఉండాలని ప్రతి విషయాన్ని ఎందుకు?ఏమిటి?ఎలా?అని ప్రశ్నించుకోవాలి నవోదయాలో చదివాను .software job  చేస్తుంటే  డబ్బు వచ్చేది కాని మనసులో    ఎక్కడో  అసంతృప్తి   ఉండేది.ఎక్కువ  మందికి ఉపయోగపడే పని సంతృప్తి కలిగించేది ఏదో దానిని ఎన్నుకోవాలనుకున్నాను. పని చేస్తున్నంత కాలం దానిలో ఆనందం పొందే విధంగా
 ఉండాలని అనుకున్నాను .దానికి సివిల్స్ అయితే సరిపోతుంది అనిపించింది జీవితం లో గమ్యం ఎంత ముఖ్యమో దానిని సాధించే క్రమంలో గమనం కూడా అంతే ముఖ్యం ఆ process  ను  ఎంజాయ్ చేయాలి .
అందుకే నాకు సివిల్స్ పరీక్ష తయారీలో కష్టం అనిపించలేదు .
సివిల్స్ ప్రేరణ మా నాన్న నుండి పొందాను. ఆయన  తన వృత్తిలో నిరంతరం ఆనందం పొందుతుండేవాడు . సివిల్స్ సాధించటానికి ముఖ్యంగా 3 అంశాలు దోహదం చేస్తాయి . 1)analytical ability 2)writing ability3) hard work and passion .విద్యార్థి దశలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి .చర్చల్లొ పాల్గొనాలి . మధ్యతరగతి నుండి వచ్చాను. నాన్న ఎప్పుడు చెబుతుండే వారు మనకు చదువు తప్ప వేరే మార్గం లేదు అని అందుకే ఎప్పుడు మెరిట్ స్టూడెంట్ గా ఉండే వాణ్ని .
          వివే కానందుడి మాటలు గుర్తుంచుకోండి .లక్ష్యము సాధించేంత వరకు విశ్రమించకండి .కలామ్ చెప్పినట్లు కలలు కనండి .వాటిని సాకారం  చేసుకోండి. మన లక్ష్యాలను సాధించిన తరువాత సమాజం లో అట్టడుగు వర్గాల వారికి సహాయ పడాలి  .ప్రపంచమ్ లోని  అత్యంత కష్ట మైన పరీక్షల్లో ఇది ఒకటి . 3 దశల   వడపోతలో మన లోని అన్ని కోణాలను పరీక్షిస్తారు .సివిల్స్ లో నైతిక విలువలు కూడా సిలబస్ లో చేర్చారు. తరువాత విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు .విద్యార్థులు తామెంతో inspire అయ్యామని చెప్పారు .
తరువాత మెడిసిన్ 1 ranker  సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్ లో పూర్తీ స్థాయి ఫోకస్ పెడితే సరిపోతుందని చెప్పారు .
తరువాత రాకేశ్ రెడ్డి తో నేను మాట్లాడినప్పుడు psycology,public administration options గా తీసు కున్నానని  చెప్పాడు . మీ  సర్వీస్ లో ఇలాగే పిల్లలతో వీలు దొరికినప్పుడల్లా కలిసి వారికి మంచి విషయాలు వివరించమని చెప్పాను . నైనిటాల్ లో కంటోన్మెంట్ సి యి ఒ గా పనిచేస్తున్నాని చెప్పారు.

Sunday 11 May 2014

ప్రేమంటే --------జిడ్డు కృష్ణమూర్తి

            ప్రేమంటే ఏమిటో మాటల్లో వ్యక్తీకరింపలేము.దీనిని ఏ విధమైన వర్ణనతో గానీ సిద్ధాంతం తోగానీ తెలియ జేయలేము.అందుకే కృష్ణమూర్తి ఏది ప్రేమకాదో తెలుసుకోమంటారు.ప్రేమ శబ్దం కాదు.అన్ని శబ్దాలు ఆగిపోయిన ప్పుడు ప్రేమపుడుతుంది.అసహ్యత,పేరాశ,వ్యతిరేకత,దోపిడీ,స్వార్థం లేనప్పుడు పూర్తి స్వేచ్చలో ప్రేమ పుడుతుంది. స్వార్థం లేనప్పుడే ప్రేమ ఉంటుంది.ప్రేమ కోసం పోటీ పడుతున్నప్పుడు ప్రేమించాలన్న ఆశయం ,ఆశా ఉన్నప్పుడు ప్రేమ ఉండదు.
           ప్రేమ ఒక పని కాదు.ఒక త్యాగమూ కాదు ప్రేమలో ఒక బాద్యత ఉన్నది.మానవ దేహం చురుగ్గా సహజమైన సున్నితత్వంతో ఉన్నప్పుడు,మనసు ఏ రకమైన ఆలోచనలతో కలుషితం కానపుడు ప్రేమ జనిస్తుంది. ప్రేమ ఒక్కటే ఇతరులను అర్థం చేసుకోగలదు.ప్రేమ ఉంటే తప్పులుండవు. ఉన్నా ఆ తప్పులను ఏ నటనా లేకుండా  దిద్దుకో వచ్చు.స్థాయీ భేదం లేకుండా  అందరినీ సమాన దృష్టితో చూచే శ్రద్ధ ప్రేమలోనే ఉంటుంది.మనిషి తనకు తటస్థపడిన ప్రతి  ఒక్కరి పట్లా బాధ్యత వహించి వాత్సల్యాన్ని దయను సహాయాన్ని అందించటమే ప్రేమగా జీవించటం.
( ఈ రోజు(మే 11) కృష్ణ మూర్తి   జయంతి .ఈ చిన్న వ్యాసం కృష్ణ మూర్తి పై  అరుణామోహన్ రచించిన చేతన అనే సిద్ధాంత వ్యాసం నుండి సేకరించినది .వారికి ధన్యవాదాలు )
కృష్ణమూర్తి గురించి మరింతగా తెలుసు కోవాలనుకుంటే ఈ క్రింది website ను సందర్శించండి .
www.jkrishnamurti.org 

Wednesday 2 April 2014

మన మనసు ఎప్పుడు స్వేచ్చగా ఉన్నట్లు ?

                  గత  అనుభవాల  తాలూకు అభిప్రాయాలు,మనం చదివిన పుస్తకాలు,చూసిన వ్యక్తులు, సంఘటనల వలన మన మనసు వాటికి  అనుగుణంగా ఆలోచిస్తూ మన ప్రవర్తనను నిర్దేశిస్తూ ఉంటుంది.ఒక రకంగా ఈ ధోరణి పాక్షిక మైనది.మనసును స్వే చ్చగా అప్పటికప్పుడు స్పందించకుండా గతానుభవాలు స్పందించేలా చేస్తాయి.  దీనితో తక్షణ సమస్యను అర్థం చేసుకోవటంలో విఫలమవుతుంటాము.
           ఉదాహరణకు మనం ఒక వ్యక్తిని గురించి విని ఉంటాము . ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకునిఉంటాము.ఇక ఆ వ్యక్తి తో మాట్లాడుతున్నప్పుడు అతనిని అదే విధంగా చూస్తాము.ఆ వ్యక్తి ఆ క్షణంలో ఎలా  మాట్లాదుతున్నాడు అన్న విషయం కంటే గతంలో అతని ప్రవర్తన ఆధారంగా అతనిని అర్థం చేసి కొంటాము.ఇంతెందుకు మనం కూడా ఎన్నో సార్లు పొరపాట్లు చేసి మరల సరి చేసుకుని మన అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటాము.మరి మనలని కూడా అవతలి వ్యక్తులు అలాగే భావిస్తారు కదా!దీనిని బట్టి ఆ క్షణంలో అవతలివారు ఎలా స్పందిస్తున్నారు? అందు లో భావం గ్రహించటానికి ప్రయత్నించాలి .మాటల్లో నిజాయితీ ఉందా ! చెప్పే విషయంలో స్పష్టత ఉందా ! వారు మాట్లాడుతున్నప్పుడు అందులో వారి హ్రుదయం ఆవిష్క్రుత మౌతుందా అన్న విషయాన్ని గమనించగలగాలి అప్పుడే మన మనసు స్వేచ్చగా ఉన్నట్లు.         

Monday 31 March 2014

కొత్త మనసుతో నూతన సంవత్సరం

                     ఆలోచనల భారంతో అలసిన మనసుకు శక్తి ఎలా వస్తుంది? వాటిని వదిలించుకోవటం లోనే కొత్త శక్తి వస్తుంది.అప్పుడు  స్వేచ్చతో మనసు విహరిస్తుంది.ఈ స్వేచ్చలోనే ప్రేమ జ్వలిస్తుంది.ప్రకృతిలో ప్రతి క్షణం గతం నశిస్తూ కొత్తదనం జన్మిస్తుంది.ప్రకృతిలోని ఈ మార్పులకు అనుగుణంగా జీవకోటి మారుతుంది.కానిమనిషి మనసు గతాన్ని పట్టుకుని వ్రేలాడుతుంది.ఎప్పటికప్పుడు నూతనంగా ఉండటం మనసుకు కష్టమౌతుంది.మనిషిలో మాన సిక సమస్యలు,సంఘర్షణలు,ఈర్ష్యా  ద్వేషాలు,పగ, కసి,వైరం,హింసయుద్ధం తదితర ముసలి ఆలోచనలు యుగాలు గా వెంటాడుతున్నాయి .
                కులం,మతం,వర్గం లాంటి ఆలోచనలు మనసును  దుఃఖమయం చేశాయి.నిత్య నూతనంగా మనసు తొణికిస లాడకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించలేము.గతాన్ని అంతం చేయకుండా కొత్త సంవత్సరంలో నిరాశగా జీవించ కూడదు.ప్రపంచంలో మార్పులు అర్థం చేసుకోవాలి.తాజాగా స్పందించాలి.పాత ఆలోచనలను దహిస్తూ కొత్త వెలుగును నింపాలి.అటువంటి మనసులోని తాజాదనంతో పాత సమస్యలన్నీ కొత్త మనసులోని మంచి భావాలతో పరిష్కార మౌతాయి.

(అందరికి ఉగాది   శుభాకాంక్షలు . ఈ చిన్న వ్యాసం జిడ్డు కృష్ణ మూర్తి బోధనల వెలుగులో "కొత్త మనసు "అనే పుస్తకం నుండి  సేకరించ బడింది. ఈ పుస్తకానికి సంధాన కర్త M. శివరాం,సంపాదకుడు నందుల ప్రభాకర శాస్త్రి )