Tuesday, 27 September 2022

ప్రపంచ పర్యాటక దినోత్సవం

 ప్రపంచ పర్యాటక దినోత్సవం(27/9/2022) సందర్భంగా మీకు ఇష్ట మైన ప్రాంతాన్ని సందర్శించండి. జీవితాన్ని కొత్త కోణం లో చూడండి.ఖరీదైన వస్తువులు ఇచ్చేసంతోషం కన్నా కొత్త ప్రాంతాలు చూస్తే కలిగే ఆనందం మిన్న.పర్యాటకం మీ జ్ఞానాన్ని విస్తృత పరుస్తుంది.జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చక్కగా ఉపయోగ పడుతుంది. మీ పర్యాటకా నుభావాలను పంచుకొని మిగతావారికి మార్గదర్శకులు కండి. ప్రకృతి పరిమళాన్ని మీ గుండెలనిండా నింపుకోండి.ప్రపంచం లోని ప్రతి ఒక్కరూ ప్రతినెలా ఏదో ఒక ప్రాంతాన్నిసందర్శిస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది.... ఒద్దుల రవిశేఖర్.

Tuesday, 20 September 2022

ఆనందమఠం... బంకించంద్ర చటర్జీ (అనువాదం:అక్కిరాజు రమాపతి రావు )

 "బంకించంద్ర చటర్జీ " పేరు చూడగానే వందేమాతరం గీతం రచయిత అని ఆసక్తిగా చదవడం మొదలెట్టాను. ఆయన గురించి అనువాదం రచయిత అక్కిరాజు రమాపతి గారు వివరంగా తెలియజేయడం తో మనకు చక్కటి అవగాహన వస్తుంది. ప్రముఖ బెంగాలీ రచయి త అయినప్పటికీ భారతీయ భాషా సాహిత్యాలను విశేషంగా ప్రభావితం చేశారు. మన స్వాతంత్ర సమరాన్ని విశేషంగా ప్రభావితం చేసిన వందేమాతర గీతం ఇందులోదే.               ఇక నవలలోని ఇతివృత్తం సన్యాసులు "ఆనందమఠం"స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిపిన పోరాటం. ఉత్కంఠ కలిగించే సంఘటనలతో కథను మలుపులు త్రిప్పుతూ, అద్భుతమైన వర్ణనలతో మనల్ని కట్టిపడేస్తుంది ఈ నవల.తెలుగు నవల అనుకునేలా రమాపతి రావు గారి అనువాదం మనల్ని చక్కగా చదివేలా చేస్తుంది.అడవిని వర్ణించడం చదివి తీరవలసిందే. బెంగాల్ వచ్చిన కరువును గురించి చదువుతుంటే హృదయం ద్రవించి పోతుంది.బ్రిటిష్ వారిపై సన్యాసుల స్వాతంత్ర్య ఉద్యమాన్ని, యుద్ధ సన్నివేశాలను ఊపిరి తీయకుండా చదివేలా చేస్తాయి.మధ్య మధ్య లో వందేమాతర గీతం వారి పోరాటాన్ని మరింత పదునెక్కిస్తుంది. పాత్రల చిత్రణ, సన్నివేశాల కూర్పు అంతా మన కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా అనిపించడం నవల యొక్క ప్రధాన లక్షణం. చక్కని చిక్కని తెలుగులో వచ్చిన నవల అనిపిస్తుంది. అనువాద నవల అనే భావనే కలగదు. ప్రతి ఒక్కరు తప్పక చదవ వలసిన నవల ఇది..... ఒద్దుల రవిశేఖర్