ఇది రచయితచే రచింపబడి ఆదరణ పొందిన 3 పుస్తకాల కలయిక. 1)బుద్ధుడు-బౌద్ధ ధర్మం 2)జనం మనిషి 3)విరాట్ 1) బుద్ధుడు -బౌద్ధ ధర్మం. బుద్ధుడి జీవితాన్ని,బోధనలను అతిసరళంగా వివరిస్తారు రచయిత ఇందులో.ఇందులో ముఖ్యాంశాలు. * *జ్ఞానోదయం పొందినప్పటి నుండి మహాపరి నిర్వాణం వరకు నిర్భయంగా బ్రతికిన మహా పురుషుడు బుద్ధుడు. *ఆత్మదీపోభవ(నీకు నీవే దీపం కావాలి) *ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి స్వేచ్ఛ,సమానత్వం గురించి బోధించిన వాడు బుద్ధుడు.ప్రేమను,కరుణను,అహింసను ప్రపంచానికి మొదటి సారి బోధించినవాడు బుద్ధుడు. *ఆయన చివరి మాటలు:సృష్టిలో ప్రతిదీ నశించేదే.బాధ పడకండి.మీరు శ్రద్ధగా ధర్మాన్ని ఆచరించి నిర్వాణాన్ని సాధించండి. *మనసును అదుపులో ఉంచుకోవడానికిపంచశీల,చతురార్య సత్యాలు,అష్టాంగ మార్గం దశపారమితలు బోధించారు.బుద్ధుడు క్రీ. పూ 563 లో పుట్టి 80 ఏళ్ల పాటు జీవించి 45 ఏండ్ల పాటు ధర్మప్రచారం చేశారు. 2)జనం మనిషి:ఒక డాక్టర్ మరణం,2 లక్షల మంది అంతిమ యాత్రలో పాల్గొనడం,ఇది కదా జీవితం.పుచ్చలపల్లి సుందరయ్య గారి తమ్ముడు,పుచ్చలపల్లి రామ్ గారి జీవితాన్ని చదువుతుంటే ఇటువంటి మనుషులు ఈ భూమిమీద జీవించారా అనిపిస్తుంది.మనిషిని ప్రేమించడం,పేదలకు ఉచిత వైద్యం,దాతృత్వం,ప్రజాసేవ,స్నేహ తత్వం,ప్రజల తరపున పోరాడడం ఆయన్ని ఒక విశిష్ట మైన వ్యక్తిగా నిలబెడతాయి.పుస్తక ప్రేమికుడు,జ్ఞానాన్వేషి,అత్యంత ప్రతిభావంతుడైన వైద్యుడు,అత్యంత ధైర్యవంతుడు,కరుణామయుడు,గాంధీజీలా తను నమ్మిన విషయం ఆచరించినవాడు రామ్.ఒక డాక్టర్ గా ఉంటూ నిరంతరం ప్రజాసేవలో తరించే వ్యక్తిత్వం అత్యంత అరుదు.చదివి తీరవలసిన జీవితం ఆయనది. 3) విరాట్ (మూల రచయిత: stephan thysvk) బుద్ధుడి కంటే ముందు జీవించిన ఒక గొప్ప యోధుడు,తాత్వికుడి జీవిత చరిత్ర ఇది. యుద్ధం వద్దనుకుని,సర్వ సైన్యాధ్యక్షుడి పదవిని కాదని న్యాయాధికారిగా నియమించబడిన ' విరాట్' కథ ఇది.తన తీర్పును ప్రశ్నించిన దోషి పాత్రలోకి ప్రవేశించి అతని శిక్షను తాను అనుభవించి,న్యాయాధికారి పదవిని త్యజించి,గృహస్థు జీవితాన్ని వీడి,అడవులలోకి వెళ్లి ఏకాంతంగా జీవించిన ఒక ఋషి కథ ఇది.చివరకు ఒక ఇల్లాలి ప్రశ్న తో మళ్లీ ప్రజల మధ్యకు వచ్చి ఒక కుక్కల కాపరిగా జీవితాన్ని ముగిస్తాడు.హృదయాన్ని మెలిపెట్టే కథనం తో సాగుతూ గొప్ప జీవితసత్యాలను,తత్వాన్ని మనకందిస్తుంది ఆయన జీవిత గమనం.
Monday, 10 May 2021
Saturday, 1 May 2021
మానవ ఆరోహణ(The Ascent of Man)....మూలం:జేకబ్ బ్రోనోస్కీ.పరిచయం:ముక్తవరం పార్థసారధి
మానవ పరిణామ క్రమాన్ని వివరించే పుస్తకాల్లో ఇది 4 దశాబ్దాల క్రితంది అయినా మనకు ఈ మధ్యనే పరిచయం చేసారు పార్ధసారధి గారు.ఏదేమైనా ఈ అంశం పై ఏ పుస్తకమైనా నన్ను కుతూహలానికి గురిచేస్తుంటుంది. ప్రకృతి పరిణామం కన్నా భిన్నమైన విషయం "మానవారోహణ".జ్ఞానమెప్పుడు పరిణామక్రమం లో ఒక దశ మాత్రమే.ప్రతి పరిణామ దశలో కీలకమైన మలుపు ఒకటి ఉంటుంది.అదే ప్రపంచాన్ని అర్ధం చేసుకునే దృష్టికోణం అన్న వాక్యాల ద్వారా రచయిత తను చెప్పదలచుకొన్న అంశాలకు పూర్వరంగం సిద్ధం చేసుకున్నాడు.మానవ మేధస్సు వివిధ రంగాలలో వికసించిన క్రమం ఇందులో ప్రస్తావించారు.1859 లో అచ్చయిన The origin of spices తో,1871 నాటి " the descent of man" తో చార్లెస్ డార్విన్ మనకు ఆదర్శం కావడాన్ని ప్రస్తావిస్తూ ఒక్కొక్క అంశాన్ని చెబుతూ ఆసక్తి కలిగిస్తూ వెడతారు.20 లక్షల సంవత్సరాల క్రితం లభించిన పిల్ల వాడి పుర్రె ను విశ్లేషించి ఆస్ట్రలో పితికస్ దానికి పేరు పెట్టారు.తొలి రాతి పనిముట్టు తయారు చేసిన కాలం ఇది.10 లక్షల సంవత్సరాల క్రితం Homoerectus ఆవిర్భవించాడు.2 లక్షల సం. నాడు Neanderthal Man దర్శనమిస్తాడు.తరువాత దశలో వచ్చినవారు Homo sapien (మనం).మానవ చరిత్రలో మౌలికమైన ఆవిష్కరణ నిప్పును రాజెయ్యటం.అగ్నిని తయారు చేసిన మనిషి జీవితమే మారిపోయింది.ఈ విషయాలతో మొదలు పెట్టి తరువాత దొరికిన కుడ్య చిత్రాల ఆధారంగా 20,000 ఏళ్ల క్రితం మనిషిని విశ్లేషిస్తారు.గత 12,000 ఏళ్ల క్రితం నుండి జరిగిన మానవ చరిత్ర మీద దృష్టి సారించారు రచయిత.10,000 ఏళ్ల క్రితం కొన్ని ప్రాంతాల్లో కొన్ని జంతువులను మచ్చిక చేసుకొని మొక్కల్ని పెంచడం ప్రారంభించాడు.మంచుయుగం చివరి దశలో వ్యావసాయిక విప్లవం(జీవ విప్లవం)ప్రారంభమైంది.మానవారోహణలో తొలిమెట్టు సంచారజీవితం మాని ఒక చోట స్థిరపడి వ్యవసాయం ప్రారంబించటమే.ప్రకృతి లో జరిగిన జన్యు సంయోగ ఫలితాల ద్వారా ఏర్పడిన గోధుమ ఏర్పడిందనే ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేయడం ద్వారా మనల్ని రచనలోకి మరింత ముందుకు వెళ్లేలా చేస్తారు.ప్రకృతి సహజంగా ఏర్పడిన వీటిని తరువాత పంట లాగా పండించడం నేర్చుకున్నాడు.క్రీ.పూ 6000 సం నాడు జెరికో వ్యవసాయ క్షేత్రంలో వీటిని పండించారు.తరువాత కొడవలి,నాగలి,చక్రం ఆవిష్కరించారు.కుక్క,గాడిద,ఎద్దు,గుర్రం వంటి జంతువులను పెంచుకుని వాటి సహాయం తో అదనపు సంపద సృష్టించిన విషయం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఈ విధంగా లభించిన ఆధారాల ఆధారంగా పనిముట్లు,నిర్మాణాలు చేయడం,లోహాలను వాడటం,గణిత అవిష్కరణలతో ఉదాహరణలతో మనకు ఆసక్తి కలిగిస్తూ ముందుకు సాగుతారు.ఇక 16 వ శతాబ్దం లో మొదలయిన పారిశ్రామిక విప్లవాన్ని గెలీలియో తో మొదలు పెట్టి న్యూటన్,leebnitz einstein,నీల్స్ బోర్ దాకా కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు.ఆవిరి యంత్రం కనుగొన్న జేమ్స్ వాట్,చార్లెస్ డార్విన్ ల కృషిని తలచుకుంటారు.కాంతి కిరణాల పై ప్రయోగాలు,రాంట్ జెన్ x రే కిరణాలు,లియో జిలార్డ్ అణు విచ్చిత్తి ప్రక్రియలను ప్రస్తావిస్తారు.గ్రెగరీ మెండల్ పరిశోధనలు,DNA ఆవిష్కరణ,క్లోనింగ్ వంటి ఆధునిక పరిశోధనల వరకు వివరిస్తారు.సైన్స్ నైతికతను పెంచాలని,మేధో ప్రజాస్వామ్యం అవసరమని చెబుతారు.what is man అనే రహస్యం తెలుసుకోవడానికి కొనసాగాలి ఆరోహణ అంటారు.జ్ఞానం వెనుక బాధ్యత,నిజాయితీ,విచక్షణ ఉంటుంది.మానవ జాతి మూలాలు, చరిత్ర ఆరోహణ క్రమం ప్రతి స్కూలు పుస్తకం లోను భాగం కావాలని అభిలషిస్తారు రచయిత.మనిషికి తన పరిణామ క్రమాన్ని గురించిన జ్ఞానమే ఆలోచన కలిగిస్తుంది.అనుభవం,ఆలోచనను కలగలిపి ఆచరణను నిర్ణయించుకోవాలని చెబుతారు. జ్ఞానాన్ని లాటిన్ భాషలో సైన్స్ అంటారు.చరిత్ర అంటే గతం కాదు,ఈనాడు,ఈ క్షణం మనం తీసుకునే నిర్ణయాల వెనుక ఉన్న జ్ఞానమే చరిత్ర .దీని ఆధారంగా మనిషి ఆత్మవిశ్వాసం తో ముందడుగు వేయడమే మానవారోహణ అన్న ముగింపు తో మనలో కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తాడు. సైన్స్ ఉపాధ్యాయులు,అధ్యాపకులు,విద్యార్థులు,చరిత్రపట్ల అభిరుచి ఉన్న వారందరు చదవతగ్గ పుస్తకం ఇది....ఒద్దుల రవిశేఖర్.