Monday, 31 March 2014

కొత్త మనసుతో నూతన సంవత్సరం

                     ఆలోచనల భారంతో అలసిన మనసుకు శక్తి ఎలా వస్తుంది? వాటిని వదిలించుకోవటం లోనే కొత్త శక్తి వస్తుంది.అప్పుడు  స్వేచ్చతో మనసు విహరిస్తుంది.ఈ స్వేచ్చలోనే ప్రేమ జ్వలిస్తుంది.ప్రకృతిలో ప్రతి క్షణం గతం నశిస్తూ కొత్తదనం జన్మిస్తుంది.ప్రకృతిలోని ఈ మార్పులకు అనుగుణంగా జీవకోటి మారుతుంది.కానిమనిషి మనసు గతాన్ని పట్టుకుని వ్రేలాడుతుంది.ఎప్పటికప్పుడు నూతనంగా ఉండటం మనసుకు కష్టమౌతుంది.మనిషిలో మాన సిక సమస్యలు,సంఘర్షణలు,ఈర్ష్యా  ద్వేషాలు,పగ, కసి,వైరం,హింసయుద్ధం తదితర ముసలి ఆలోచనలు యుగాలు గా వెంటాడుతున్నాయి .
                కులం,మతం,వర్గం లాంటి ఆలోచనలు మనసును  దుఃఖమయం చేశాయి.నిత్య నూతనంగా మనసు తొణికిస లాడకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించలేము.గతాన్ని అంతం చేయకుండా కొత్త సంవత్సరంలో నిరాశగా జీవించ కూడదు.ప్రపంచంలో మార్పులు అర్థం చేసుకోవాలి.తాజాగా స్పందించాలి.పాత ఆలోచనలను దహిస్తూ కొత్త వెలుగును నింపాలి.అటువంటి మనసులోని తాజాదనంతో పాత సమస్యలన్నీ కొత్త మనసులోని మంచి భావాలతో పరిష్కార మౌతాయి.

(అందరికి ఉగాది   శుభాకాంక్షలు . ఈ చిన్న వ్యాసం జిడ్డు కృష్ణ మూర్తి బోధనల వెలుగులో "కొత్త మనసు "అనే పుస్తకం నుండి  సేకరించ బడింది. ఈ పుస్తకానికి సంధాన కర్త M. శివరాం,సంపాదకుడు నందుల ప్రభాకర శాస్త్రి )

Sunday, 9 March 2014

గిజుభాయి రచించిన "మాస్టారూ" పుస్తక సమీక్ష

పాఠకుల సమాఖ్య మార్చ్ నెల సమావేశం
          ఈ సమావేశం లో పి.మల్లిఖార్జున గారు గిజుభాయి పుస్తకం  మాస్టారూ లోని అంశాలను వివరించారు. అందులోని అంశాలు "బానిస మనస్తత్వాన్నిపిల్లల్లో నుండి పారద్రోలాలని లేకుంటే వారిలో సృజనాత్మక  శక్తి లోపిస్తుందని  చెప్పారు.పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే ఎన్నో అంశాలను ఈ పుస్తకం లో వివరించారు.  .అవసరం లేని వస్తువులను పారవేస్తుంటే అనవసరమైన విషయాలను వదిలివేస్తారు.పరీక్షలు అంటే కలిగే భయం పెద్ద అయ్యేంతవరకు వెంటాడుతుంది .గణితం కుతూహలాన్ని కలిగించాలి.పిల్లల ప్రతిభను మాస్టారు తనదిగా వారి అపజయాలకు వారే కారణం అని నిర్దారిస్తారు.పిల్లల్ని బలవంతాన చదివించకూడదు.పరీక్షలు పిల్లల్ని విజేతలు, పరాజితులుగా విభజిస్తాయి.పిల్లలకు జీవితం గురించి నేర్పాలి.పిల్లల్ని తప్పు పట్టకూడదు .లార్వానుండి సీతాకోక చిలుక  బయట పడే క్రమం లాగా పిల్లలు సహజ సిద్దంగా నేర్చుకోవాలి. పిల్లలో సౌందర్య దృష్టి కళాత్మకత ఉంటుంది. స్వేచ్చగా పనిచేసే వాతావరణం వారికి  కల్పించాలి".
                 తరువాత కరపత్రం తయారీలొ ఉండాల్సిన అంశాలపై చర్చ జరిగింది.సభ్యులు దీనికి చాలా విలువైన సూచనలు చేశారు. వచ్చే సమావేశం లోపు  తయారు చేయాలని  నిర్ణయించారు. పాఠకుల సమాఖ్య తరపున రేడియో కార్యక్రమం కూడా ఇవ్వాలని నిర్ణయించారు.వచ్చే నెల సమావేశం 6/4/2014 న జరగాలని తీర్మానిం చారు.విద్యార్థులను జీవితం గురించి తెలుసుకునేలా సంసిధ్ధుల్ని చేయాలని  గ్రంధ పాలకులు మధుసుధన రావు గారు సూచించారు.పాఠశాలల్లో  తరగతి పుస్తకాలే కాకుండా మహనీయుల జీవిత  చరిత్రలు,వార్తాపత్రికలు చదివించాలని రవిశేఖర్ సూచించారు.ఈ కార్యక్రమంలో  చాంద్ భాషా,ముసలా రెడ్డి ,బసిరెడ్డి, సుబ్బారావు రంగన్న,చంద్రశేఖర్,అరుణ్ కిషోర్ ఆదినారాయణ రెడ్డి , ఫారూఖ్ పాల్గొన్నారు . ఈ సారి నెల నుండి  ఈ సమావేశం  వివరాలు నా మరో బ్లాగ్ అయిన  friendsfoundation(snehithfoundation.blogspot.in )లో వివరిస్తాను .                                                                 
 పుస్తకాన్ని సమీక్షిస్తున్న  మల్లిఖార్జున

Thursday, 6 March 2014

మార్కాపూర్ లో Readersclub( పాఠకుల సమాఖ్య) ప్రారంభం

             మార్కాపూర్ శాఖా గ్రంధాలయంలో 5/2/14 న "readersclub" ప్రధమ సమావేశం సజ్జా మధుసూధన రావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేయటం జరిగింది.దాదాపు 20 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు.
                   దీని ప్రారంభానికి నేపధ్యం గత సంవత్సరం ఇదే బ్లాగ్ లో "పుస్తకాలే మన నేస్తాలయితే "అన్న వ్యాసం వ్రాయటం జరిగింది.ఈ వ్యాసానికి ప్రతిస్పందనగా "శర్కరి "బ్లాగ్ ను నిర్వహిస్తున్న జ్యోతిర్మయిగారు ఒక వ్యాఖ్య వ్రాశారు .ఆమె మాటల్లోనే  
"నాకు అమెరికాలో నచ్చిన మంచి విషయాల్లో ఇది ఒకటి. పిల్లలకు మాటలు కూడా రాని సమయం నుండే పిల్లలకు పుస్తకం చదివి వినిపిస్తారు. ఇక బడికి వెళ్ళడం మొదలుపెట్టినప్పటినుండి రోజుకు కనీసం 20 నిముషాలు పుస్తకం చదవాలి. కొంచెం పెద్దయ్యాక తరగతిలో వాళ్ళు చదివిన పుస్తక౦పై చర్చలు జరుగుతాయి. ఇవి కాక లైబ్రరీలు ప్రతి వేసవిలో 20 పుస్తకాలు చదివిన వారికి ఓ పుస్తకం బహుమతిగా ఇస్తుంది. ఇలా చిన్నతనం నుండే పుస్తకం చదవడం జీవితంలో ఓ భాగంగా మారుతుంది."
       ఈ వ్యాఖ్య చూసిన తరువాత ఈ విషయాన్ని మార్కాపూర్ గ్రంధ పాలకుడు సజ్జా మధుసూదనరావు గారికి చెప్పగా అయన వెంటనే స్పందించి గత వేసవిలో ఈ పోటీలు ఏర్పాటు చేసారు.కొద్ది మంది పిల్లలే హాజరయినా నెల రోజులు ఉత్సాహంగా వచ్చిపుస్తకాలు  చదివారు. తరువాత వారికి బహుమతులు పంపిణీ చేసారు.ఆ సమయంలో మాట వరసకు మధుసూదన్ గారు ఇక్కడకూడా readersclub  ఉంటుంది అని చెప్పటంతో దానిని బలోపేతం చేద్దామని నిర్ణయించటం జరిగింది.ఇప్పటికి అది కార్యరూపం లోకి వచ్చింది .
               ఈ సమావేశానికి వచ్చిన వారికి readersclub గురించి మధుసూదన్ రావు గారు వివరించారు .దాని ఉద్దేశ్యాలను,లక్ష్యాలను నేను (రవిశేఖర్ ) వివరించాను.ముఖ్యంగా పుస్తకాలు చదివే వారిని ప్రోత్సాహించటం ఇందుకు సమాజానికి గ్రంధాలయానికి అనుసంధానం గా పనిచెయ్యాలి అని నిర్ణయించటం జరిగింది.తరువాత హాజరయిన వారు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు .అందరి అభిప్రాయాలతో వచ్చే నెల సమావేశానికి అజెండా నిర్ణయించటం జరిగింది.ప్రతినెల మొదటి ఆదివారం ఉదయం 11. 00 గంటలనుండి 12. 00 గంటల వరకు సమావేశం జరపాలని నిర్ణయించటం జరిగింది.2/3/14 న సమావేశం ఉంటుందని అందులో పుస్తక సమీక్ష,కరపత్రం తయారీ,పిల్లల పుస్తకాలను సర్దటం అన్న అంశాలను నిర్వహించాలని నిర్ణయించారు.పుస్తక సమీక్షకు మల్లిఖార్జున గారు అంగీకరించారు.readersclub అనే పేరు కాకుండా పాఠకుల సమాఖ్యగా దీనికి పేరు పెట్టాలని అందరు ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈ కార్యక్రమంలో ఆనంద్,మల్లిఖార్జున,చాంద్ భాషా ,ముసలారెడ్డి ,వీరారెడ్డి ,నాగశ్రీ ,తోట

శ్రీనివాస రావు ,అరుణ్ కిశోర్,ఆదినారాయణ సుబ్బారావు,అక్బర్ అలీ పాల్గొన్నారు .