Sunday 9 February 2014

నీకు తెలుసు... ఒక్క రాత్రిలో ప్రేమ పుట్టదని.... ఒక్కరాత్రిలో నక్షత్రం పుట్టదని ......

              ప్రేమ గురించి ఇంత బాగా ఎవరు చెప్పి ఉంటారు. ఊహించగలరా!"నా దేశం .. నా ప్రజలు " రచనకు నోబెల్ సాహిత్య బహుమతికి నామినేట్ కాబడిన శేషేంద్ర శర్మ.ఆయన భార్య రాజకుమారి ఇందిరా దేవికి రాసిన ప్రేమలేఖ లలోని కవిత్వం ఆయన మాటల్లోనే ....... 
            నా సృజనాత్మక లోకాలని నా ప్రేయసి మేల్కొలిపింది 
            ఆ మేలుకున్న అంతర్లోకాలు పూస్తున్న పరిమళాలే
            ఈ నాటి గాలుల్లో కలిసి వ్యాపిస్తున్నాయి 
            నా ప్రేమ రాజకుమారి ... !నీ ఉత్తరాలు విప్పాను ... పేజీల్లోంచి
            వెన్నెల రాలింది ... 
            నీవు స్త్రీవి కావు అందాల తుఫానువి. 
           అందరి భాషా కంఠం నుంచి వస్తే నీ భాషకన్నుల్లోంచి వస్తుంది  
           నీవు హృదయాన్ని అక్షరాల్లో పెట్టిన పక్షివి . 
           ఒక్క ముద్దు ఇస్తే అది నీ గుండెలో 
           తుఫానుగా మారుతుందనుకోలేదు 
           నా హృదయం లోకి ఉషస్సులు 
           మోసుకొస్తున్న ని న్నెవ్వడాపగలడు
           నీ కనులు ఇంద్ర నీలాల గనులు 
           ఏ అవ్యక్త భౌతిక ద్రవ్యాలతో కాచిన పీయూషమో నీ ప్రేమ !
           అందులో తమ స్వప్నాలు కరిగించుకుని తాగి 
           ఎందరో మానవ మాత్రులు దేవతలై రెక్కల మీద ఎగిరిపోయారు 
           ఒక్క బొట్టు చప్పరిస్తే చాలు దేహంలో కండరాలు 
           మొహంలో మునిగిపోతాయి 
           ఒక్కటే చాలు నాకు ఎక్కడ నా కలలన్నీ నిజమో 
           ఆ మధుర నిశ్శబ్దం లాంటి ప్రవాసం నీ దరహాసం 
           నీ కన్నుల్లో సముద్రాలే కదుల్తాయి పసిపిల్లల్లా 
           నీ ఒక్క మాటలోనే ఒదిగి పడుంటాయి 
           మనిషి నిర్మించిన ప్రేమ గాధల లైబ్రరీలన్నీ ... 
            నీ ఊహల్లో కిరీటాలు ధరించిన రాజులు కూడా 
           తల వంచి నడిచి పోతారు తమ పరిపాలన సాగని వీధుల్లో నడుస్తున్నట్లు .... 
నిన్ను ఒక్క దాన్నే ప్రేమిస్తా. చిన్నప్పుడు కాశీ మజిలీ కథల్లో నుంచీ అరేబియన్ నైట్స్ కథల్లో నుంచీ నా చైతన్య సీమల్లొకి దిగిన రాజకుమార్తె లందరూ నీ వొక్కతెవె   అయినట్లు ప్రేమిస్తా ...  
                                                                    నీ శేషేంద్ర                                       
       తేనెలో కలాన్ని ముంచి వ్రాసినట్లు ఎంత కమ్మని కవిత్వం.    ఆస్వాదించండి మరొక్క సారి  

5 comments:

  1. Ravisekhar gaaroo, chaalaa baagundi. mee blog ippude chusanu.mee posts chaalaa baagunnaayi.:-):-)

    ReplyDelete
  2. మరొక సారి చదివి హృదయంలో బంధించుకునే అవకాశం కల్గించిన మీకు .. సదా ధన్యవాదములు .

    ReplyDelete