Thursday 25 April 2013

ఆరడుగుల నేల ఆహ్వానించిన వేళ----కె.బాలకృష్ణా రెడ్డి గారి దీర్ఘ కవిత పై సమీక్ష

వర్తమాన సమాజంలో మనిషి జీవితం ఎలా ఉన్నది? 
అతను ఎలా జీవిస్తున్నాడు? ఎటువంటి పనులు 
చేస్తున్నాడు? అతని ప్రవర్తన ఎలా ఉంది?అతను చేసే
తప్పులు ఏమిటి? మనిషి ఎందుకిలా తన జీవితాన్ని నిప్పులకుంపటిగాసంఘర్షణల రణంగా
మార్చుకున్నాడు. 
చివరికి తన వెంట ఏమి తీసుకు వెడుతున్నాడు? జీవితాన్ని 
ఎలా జీవించాలి?మనిషన్నవాడు ఎలా ఉండాలి? 
మరణించేంత వరకు ఏమి చెయ్యాలి?వంటి ప్రశ్నలు 
భావ కవిగా ప్రసిద్ధులైనకె.బాలకృష్ణా రెడ్డి గారిని ఉక్కిరి బిక్కిరి చేసాయి.
అది ఇలా "ఆరడుగులనేల ఆహ్వానించిన వేళ "
 అనే దీర్ఘకవితగా మారింది.

      అరవై పేజీల ఈ జీవన కావ్యాన్ని ఒక వ్యాసంలో విశ్లేషించటం సాధ్యం కాదు.
ఇందులోని ముఖ్యమైన విషయాలను, అద్భు
తమైన కవిత్వాన్ని మాత్రమే ప్రస్తావిస్తాను. "ప్రశ్నిస్తున్నా..."
 అని కవితకు ముందు ఆయన వ్రాసిన కవితా నేపధ్యం చదివితే చాలు మొత్తం అంతా అర్థమవుతుంది.
ఇది మనిషి కథ
ప్రతి మనిషి వ్యథ 

నిరంతరం సంపాదించాలనే చూస్తున్న 
మనిషి అర్ధాంతరంగా మాయమైన వేళ
ఆహ్వానిస్తుంది ఆరడుగుల నేల 
అక్కడ అతని ఆత్మను తట్టి లేపి 
కవి అనుసంధించిన ప్రశ్నల పరంపరలే ఈ కావ్యం. 

మనిషివైతే రగిలిపో మనసుంటే పగిలిపో
దానవతను విస్మరించి మానవతను 
ఆవిష్కరించి మానవుడిగా మిగిలిపో 

అంటూ మనిషి గురించి మానవత్వాన్ని
గురించి పూర్తి కవితా వస్తువుగా వచ్చిన కావ్యమిది. 
పుట్టి నప్పటి నుండి వృద్ధాప్య 
వరకు జీవితాన్ని వర్ణిస్తూ

బాల్యం
బంగరు స్వప్నం
అరిషడ్వర్గం దరిచేరని దుర్గం
వృద్ధాప్యం
వేలవేల అనుభవాల
అనునయాల సంకలనం   ----- చాలా సులభంగా అర్థమవుతున్న పదాల పొందిక. 

జీవితం ఒక కమ్మని యోగం   ------- ఒక యోగం లాగా జీవితాన్ని గడిపితే ఎంత బాగుంటుంది.
మరణం తప్పదని తెలిసి
ప్రతిక్షణం రణన్నినాదం
ప్రతి నిముషం మారణ హోమం
పగలు రేయి అసుర కేళీ కలాపం 
 

వర్తమానంలో జరుగుతున్న వాస్తవ దృశ్యానికి ఇది ప్రతిబింబం.
స్మశానాన్ని వర్ణిస్తూ 

జీవన సాఫల్యాన్ని,వైఫల్యాన్ని
దైన్యాన్ని హైన్యాన్ని
తర్కిం చుకునే ఏకైక ప్రదేశం

సమాజం లోని అన్ని వృత్తుల వారు
తమ వృత్తి ధర్మాన్ని 
సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం బాగుపడుతుందని 
కవి భావిస్తాడు.కాని వారు ఆ పని చేస్తున్నారా అన్న 
ఆవేదనతో

దేశం కన్నీరు పెడుతుంది
సమాజం వెక్కి వెక్కి ఏడుస్తుంది

ఒకప్పటి మనిషి తనం మరచి రాక్షత్వాన్ని
మనిషి అలవరచుకున్నాడు అని కవి బాధపడతాడు.
మరణించిన 
మనిషిని శ్మశానం లోకాసేపు ఆపి అతని ఆత్మతో సంభాషిస్తాడు 
కవి.అతను జీవితం లో ఏమేమి చేసాడో ఏమి కోల్పోయాడో 
ప్రశ్నిస్తూ ఈ దీర్ఘ కవితను కోన సాగిస్తాడు.


జీవితం ఒక వరం
'జీవించు' వాళ్ళెందరు

ప్రేమించటం ఒక తపస్సు
'ప్రేమించే' వాళ్ళెందరు
  
ఎంత లోతయిన ప్రశ్న వేసారో గమనించండి.తన జీవిత కాలంలో అర్థాంగిని
ఏ  మేరకు అర్థం చేసుకున్నావు అమ్మా నాన్నలను ఏ  విధంగా  అర్థం ఎలా చేసుకున్నావు
 అని ప్రశ్నిస్తూ

అర్థం కాలేదా అమ్మ మనసు
వ్యర్థం అయింది కదా నాన్న తపస్సు

నీ ఎదుగుదల కోసం ఎంతో మందిని 
నాశనం చేసావు,
వారి ఉసురు నీకు తగిలిందేమో అంటూ

నువ్వు  మనిషితనం కోల్పోయావు  
మానవతకు దూరంగా జరిగావు.
సంగీతం సాహిత్యం లాంటి కళలంటే 
తెలీకుండాజీవించావు
జీవిత మంటే ఓ ఆహ్లాదం

మందారాలు, మకరందాలు
సింధూరాలు, సిరిచందన గంధాలు
మధు వనాలు, మలయానిలాలు
హరివిల్లులు, విరిజల్లులు
పూల పుప్పొళ్ళు, పున్నమి చప్పుళ్ళు

లాంటి తన భావ కవితా విభ్రమాన్ని
మన కళ్ళ 
ముందు౦చుతాడు. ఇంత అందమయిన జీవితాన్ని నరక ప్రాయం 
చేసుకున్నావెందుకని కవి మనిషిని ప్రశ్నిస్తున్నాడు. 

నువ్వు మాత్రం మనిషి తనం కోల్పోయావు?

మన నాగరికత, భాష సంస్కృతి 
అంతరిస్తున్నాయని   కవి ఆవేదన


ఎంత ఖేదం నలుగురికీ పంచావో 
ఎంత మోదం బూడిద పాలు చేసావో    ------- మనిషి చేస్తున్న
దిదే కదా!

నవ్వడం మరిచి పోయావు
నడవడం మరిచి పోయావు
నయాగరాలు మరచిపోయావు
నయగారాలు మరచి పోయావు
ఎన్ని అద్బుతాలు కోల్పోయావు
ఎన్ని జీవన సత్యాలు విస్మరించావు

అని కోల్పోయిన జీవితాన్ని గురించి చెబుతున్నాడు.

గుట్టలుగా కలిమి పోగుచేసుకున్న వ్యామోహం
కట్టెలతో చెలిమి చేస్తున్న దృశ్యం
  

అంటూ నీ వెంట ఏమీ రావు అనే సందేశం వినిపిస్తున్నాడు. మనిషికున్న భయాలకు మూల కారణం

అజ్ఞానం,అవివేకం
అక్కర లేని ,అవసరం లేని
కలిమితో బాంధవ్యం      ------ అని ఒక్క మాటతో 
తేల్చేస్తారు కవి.


మనిషికి డబ్బు చేసింది
నయం కాని మాయదారి జబ్బు చేసింది    --------

 అన్నకఠిన సత్యాన్ని ఆవిష్కరించారు. 


ప్రతి వ్యక్తిలో నైతిక విలువల పతనం
కుట్రలు,కుయుక్తుల చెలగాటం
మానవత శిధిల మై పోతున్న ఆనవాళ్ళు
దానవత రొద చేస్తున్న కీచురాళ్ళు     --------- 

అంటూ మనిషి తత్వాన్ని x-రే తీసాడు.


ప్రేమంటే ఒక ఉన్మాదం
ప్రేమించకుంటే ఉగ్రవాదం
ఏ ఉదాత్త సంస్కృతికి చిహ్నాలు
ఏ గొప్ప నాగరికతకు ఆనవాళ్ళు       ---------

 అంటూ ప్రేమ పేరుతో జరుగుతున్న
 ఆకృత్యాలను ప్రశ్నిస్తున్నాడు.


మానవత్వం కోల్పోయిన మనిషి
మృదుత్వం ఆర్ద్రత ఆవిరయిన మనిషి    ------

మనిషి ఇలా ఉన్నాడు ప్రస్తుతం.


ఒకటే జీవితం
ఇంత ఉలికి పాటెందుకు
ఒకటే దేహం
ఇంత రాద్దాంతమెందుకు     ------- 

నాలుగు మాటల్లో జీవిత సారం చెప్పారు.

ఒక ఒప్పందం చేసుకుందాం
చితి మంటల సాక్షిగా
చివరి వీలునామా వ్రాసుకుందాం 
కనీసం వచ్చే జన్మ లోనయినా మనిషిగా నడయాడాలని
శపథం చేసుకుందాం       ------- 

 అంటూ
 మనిషికి వీడ్కోలు ఇస్తున్నాడు.

ఈ భూమిపై మనజీవితం
విహారానికొచ్చినట్లుండాలి .
వచ్చిన పని కాగానే మృత్యువు సడి వినగానే
హాయిగా నిష్క్రమించాలి
ఒక చరిత్రను లిఖించి
ప్రతి ఒక్కరూ మహాత్ముడయి
నిర్గమనం చేయాలి.
అదే నిజమైన మరణం.
మహాభినిష్క్రమణం 

మనిషిని గురించి ఇంత వేదన చెంది, 
జీవితం ఎలా ఉండాలో, 
ఎలా ఉండకూడదోఇంత సరళంగా ఇంత అంద మైన 
పదాలతోచెప్పిన కావ్యం మనకు కనిపించదు. 
సామాన్య పాఠకుడిని కూడా చివరి వరకు చదివిస్తూ తీసుకువెడుతుందిప్రతి ఒక్కరికి తన జీవితం లోని 
అనేక సంఘటనలను గుర్తుకుతెస్తుంది.

మనిషి తరపున వారికి ధన్యవాదాలు. 

ఈ జీవన కావ్యం ప్రతి ఒక్కరు చదవతగ్గది. కె. బాలకృష్ణా రెడ్డి గారి కవితల కొరకు వారి "కవితాంధ్ర "
బ్లాగ్ చూడగలరు.


                         

                          

12 comments:

  1. మీ సమీక్ష చక్కగా ఉందండి.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు ప్రేరణ గారు!

      Delete
  2. చివరగా మీరు ఉటంకించిన కవిత బాగా నచ్చింది. విహారానికొచ్చినట్లు హాయిగా జీవించి వెళ్ళిపోవాలనేది.ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. జీవితం చాలా సరళ మైనది .మనమే దాన్ని చాలా క్లిష్టంగా మార్చుకుంటున్నాము.ధన్యవాదాలు లక్ష్మిదేవిగారు!

      Delete
  3. "కవితాంధ్ర" నాకు నచ్చిన ఒక బ్లాగ్....బాగుందండి మీ సమీక్ష!

    ReplyDelete
    Replies
    1. నాకు కూడానండి.ధన్యవాదాలు పద్మార్పిత గారు..

      Delete
  4. రవిశేఖర్ గారు మీ సమీక్ష బావుందండి. మీకాపుస్తకం ఎంత నచ్చిందో తెలుస్తోంది. నాన్న గురించి మీ గురించి ఎప్పుడూ చెపుతూ ఉంటారు కాని, మీ అభిమానం ఇవాళ చూస్తున్నాను. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. జీవితం గురించి ఇలా ఆలోచించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం.ఈ దృక్పధాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని నా ప్రయత్నం.మీకు ధన్యవాదాలండి..

      Delete
  5. మిత్రమా....మీ సమీక్ష చదువుతూ ఉంటే ఆ గేయ రచయిత హృదయం,వారి దర్శనం రెండూ జరిగిపోయాయి.మీకు ఎంత అనురక్తి,స్పష్టత లేకపోతే ఇంత చక్కని సమీక్ష ఆవిర్భవిస్తుంది.అక్షరాభినందనలు.

    ReplyDelete
  6. Send some more Reviews మిత్రమా

    ReplyDelete
  7. Send some more Reviews మిత్రమా

    ReplyDelete