Sunday 6 May 2012

నేడే గౌతమ బుద్ధ జయంతి


                                  ఈ రోజు గౌతమ బుద్ధ జయంతి .మానవాళికి తెలిసిన అతి ప్రాచీన తాత్వికులలో ఆయన ఒకరు.సంక్షిప్తం గా బుద్ధుని గురించి ఆయన బోధనల గురించి తెలుసుకుందాము.ఈయ న అసలు పేరు గౌతముడు..తండ్రి శుద్దోధనుడు,తల్లి మాయాదేవి.క్రీ .పూ 565_485 మధ్య కాలం లో జీవించాడు.తల్లి మరణం తో పినతల్లి మహాప్రజపతి పెంచింది.యుక్తవయస్సు లో యశోధర తో వివాహం అయింది.వారికి ఒక కుమారుడు.పేరు రాహులుడు.నేడే 
       దారుణమైన ,నివారణా సాధ్యమైన మానవాళి కష్టాలు ఆయన అనుభవం లోకి వచ్చాయి ఆకలి అంటురోగాలు,ఆహార కొరత వీటిని ఆపేందుకు మార్గం లేదా అని ఆలోచించాడు.ఇవన్నీ చూస్తూ రాజ భోగాలు అనుభవిస్తూ ఉండటమా!లేక గొప్ప లక్ష్య సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేయడమా!నాటి ప్రజాబాహుల్యం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు ఒక పరిష్కారమార్గాన్ని కనుగొనుటకు అవసరమైన జ్ఞానాన్ని సంపాదించడానికి రాచరిక జీవితాన్ని వదిలి వేశాడు.ఏడు సం:సుదీర్గమైన తపస్సు అంటే పరిశోధన చేసాడు.బుద్ధగయ వద్ద జ్ఞానోదయం అయింది.కఠినమైన శిక్షణ,ఏకాగ్రత అలవరచుకున్నాడు.ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని,ఆలోచనా విధానాన్ని సాధన చేసేందుకు అనుగుణంగా తన శరీరాన్ని మన సును పదును పెట్టుకున్నాడు.బుద్ధుడు అనే బిరుదు ప్రజలు, శిష్యులు ఆయనికి ఇచ్చారు.గౌతముడు ఈ జ్ఞానాన్ని ,మానసిక పరిపక్వతను అద్యయనం,బోధన అనే నిరంతర ప్రక్రియల ద్వారా సంపాదించు కున్నాడు .
       ఆయన బోధనల్లోని ముఖ్యాంశాలు.
*"నా లోపలినుంచి జ్ఞానం ఉదయించిన తర్వాత కోరికల మత్తునుంచి,పునర్జన్మ మత్తునుంచి అజ్ఞానమనే మత్తు నుంచి నా హృదయం ,నామనసు విముక్తి చెందాయి.జ్ఞానం,స్వాతంత్ర్యం నాకు స్వేచ్చను ప్రసాదిం చాయి.పునర్జన్మ లేదని నాకు తెలిసింది.నేను నా లక్ష్యాన్ని చేరుకునాను."
     స్వీయ జ్ఞాన సముపార్జన కోసం దుర్భరమైన కష్టాలు అనుభవించిన అనంతరం గౌతముడు జ్ఞానిగా మారాడు.అప్పటినుండి బుద్ధునిగా పిలవ బడ్డాడు.
*"భావోద్రేకాల ఉచ్చును చేదించడం తెలిసిన వాడిని,జనాన్ని కష్టాల సుడిగుండం నుంచి కాపాడగలిగిన వాడిని,ఐహికవాంఛలకు స్వస్తి పలికి వాటి కాటుకి బలికాకుండా చేయగలిగిన వాడిని.సత్యమనే వెలుగు ద్వారా అజ్ఞానపు చీకటిని చెల్లా చెదురు చేయగలిగిన వాడిని తద్వారా మనిషికి అసలైన నిబ్బాన(నిర్వాన)దశను అందించగల వాడిని నేనే!"
    తాను ప్రవచించింది ఆచరించి చూపిన  మనీషి బుద్ధుడు .ధనం కోసం గాని కీర్తి గాని ఆశించకుండా ఏ వ్యక్తి అయినా వ్యవహరిస్తే అతనే బుద్ధుడు.తనకు తాను ఏ దివ్యత్వాన్ని ఆపాదించుకోలేదు.
   హృదయ బంధనాలు విచ్చిన్నమయ్యాయి.సందేహాలన్నీ  పటాపంచలై,భవబంధాలను ప్రేరేపించే కర్మలన్నీ  నివ్రుత్త మయ్యాయి.పరమ సత్యం తేట తెల్లమయింది.బుద్ధుని హృదయం కరుణతో నిండి పోయింది.
 ఆయన ప్రవచించిన అష్టాంగ మార్గం.
1)సమ్యక్ దృష్టి (మంచి ఉద్దేశాలు)RightViews
2)సమ్యక్ సంకల్పం (మంచి  ఆశలు)Right Aspirations
3)సమ్యక్ వచనం (మంచి  మాటలు)Right Speech
4)సమ్యక్ కర్మ (మంచి ప్రవర్తన)Right Conduct
5)సమ్యక్ జీవనం(మంచి బ్రతుకు దెరువు)Right Livelyhood
6)సమ్యక్ ప్రయత్నం(మంచి వ్యాయామం) Right Effort
7)సమ్యక్ స్మృతి(మంచి మనస్సు,ఆలోచనలు) Right Mindfulness
8)సమ్యక్  సమాధి(మంచి ఉల్లాసం స్వీయ నియంత్రణ)Right Contemplation
               ఇవి బుద్ధుడి తత్వ శాస్త్ర మూలాలు.
    ఈ విశ్వానికి ఒక క్రమబద్దత వున్నదని ,దాని తీరుకు ఒక ఆధారం వున్నదని ప్రకటించాడు.జ్ఞాన శాస్త్రం మీద ఈ ప్రకటన ప్రభావం అపారంగా వుంది.
బుద్ధుడు బౌతిక ఆధ్యాత్మిక వాదాన్ని మేలవించాడు.తన జీవితమంతా ఆత్మ చైతన్యం ,ఆత్మ నియంత్రణ కోసం కృషి చేసాడు.
*కోరికలు,లోభం దుఖానికి కారణం.బాధ,బాధకు మూలం ,బాధా విముక్తి,బాధా విముక్తికి మార్గం--ఈ మహాసత్యాలు సంపూర్ణం గా అవగాహన అయిన తర్వాత జీవన ప్రక్రియ పట్ల మొహం నశిస్తుంది.
*సంపూర్ణంగా మనసా,శారీరకంగా సత్యాన్వేషనే లక్ష్యం.
*అనిత్యమైన అహాన్ని వదిలి నిత్యమైన సత్యాన్ని గుర్తించాలి.
పౌర సమాజానికి ప్రవర్తనా నియమావళిని రూపొందించిన గొప్ప ప్రాచీన తాత్వికుడు బుద్ధుడు.
ఒక కారణం నుంచి మొదలయ్యే వాటన్నింటికి బుద్ధుడు కారణాన్ని వివరించాడు.ప్రతి కారణం ఎలా అంతమవుతుందో కూడా చెప్పాడు.ఇదే మహా జ్ఞాని ప్రవచనం.
 ప్రతి దానికి ఒక కారణం వుంటుంది.ప్రతి కారణానికి తనదైన ప్రభావం వుంటుంది.అనే సత్యాన్ని కనుగొనడం ద్వారా సమకాలీన పాశ్చాత్య తత్వవేత్తల నందరినీ అధిగమించాడు.
*కారణం _ప్రభావం.
   క్రీ.పూ ఆరవ శతాబ్దిలో బుద్ధుడు ఇంతటి సమున్నత శిఖరాలు అందుకోవడం చాల గొప్ప విషయం.
     బుద్ధుడు  తన  80 వ  ఏట క్రీ.పూ 480_485 ప్రాంతం లో చనిపోయాడు.
(కంచ ఐలయ్య గారు ,స్వామి రంగనాదానంద గార్ల  రచనలనుండి సేకరించిన సమాచారాన్ని ఇచ్చాను.వారికి సదా కృతజ్ఞతలు.)
           


4 comments:

  1. చాలా విషయాలు తెలుసుకున్నాను. . ఈ మధ్య ఒక ఇమైల్ లో ఇలాంటిదే ""8 Wonderful Gifts That Don’t Cost A Cent"" అని చదివినట్టు గుర్తు.
    http://www.farmersalmanac.com/home-garden/2009/11/30/8-wonderful-gifts-that-dont-cost-a-cent/
    మంచి విషయాలు తెలిపారు. ధన్యవాదాలు మీకు.

    ReplyDelete
    Replies
    1. thanks.మీరు చెప్పిన సైట్ చూశాను.good content.మంచి సైట్స్ వుంటే ఇలాగే తెలియ చేస్తువుండండి.

      Delete